దేవస్థానం అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష
సమగ్ర నివేదికలతో హాజరు కావాలి
నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి చేయవలసిన పనులపై బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధిని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవాలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. దేవాలయం చుట్టూ రెండు ప్రాకారాలు, రోడ్డు నిర్మాణానికి అధికారుల వద్ద ఉన్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సమీక్షించారు. ఈనెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన, రాముల వారి దర్శనం నేపథ్యంలో ఏర్పాట్ల గురించి మంత్రులు సమీక్ష చేశారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రులు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఏమాత్రం పురోగతి లేదు. ఇది దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. 100 కోట్లతో ఆలయ అభివృద్ధిని ఏ విధంగా చేయాలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 17 లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 18న జరగనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో ఉన్న లోటుపాట్లను దేవస్థానం అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, సూపర్డెంట్ ఇంజనీర్ మల్లికార్జున్ రెడ్డి, స్థపతి, దేవాదాయ శాఖ సలహాదారు శ్రీవల్లి నాయగం, ఆర్డీవో దామోదర్ రావు, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.