- మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ రాజీనామా
- ఏఐసీసీ అధ్యక్షుడికి తన రాజీనామా లేఖను పంపించిన వైనం
- తనకు ఇస్తారనుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే టిక్కెట్టును మైనంపల్లికి కేటాయించడంతో మనస్తాపం
- పార్టీ కోసం అహరహం కష్టపడిన వారికి అన్యాయం జరిగిందంటూ ఆవేదన
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజిగిరి టిక్కెట్ కేటాయించినట్టు పార్టీ పెద్దలు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. స్వయంగా రాహుల్ గాంధీతో చర్చల తరువాత కూడా ఆయన శాంతించలేదు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. మల్కాజిగిరి టిక్కెట్టు ఆశిస్తున్న శ్రీధర్‌కు అధిష్ఠానం నిర్ణయం తీవ్ర వేదన మిగిల్చింది.