
- ఏపీ నుంచి హైదరాబాద్ కు తరలింపు
- లారీలకు ముఖ్యమంత్రి ఫొటోలు
- భద్రాచలం వద్ద 16 లారీల పట్టివేత
- టీఎస్ఎండీసీ అధికారులకు బెదిరింపులు
- లారీలు వదలిపెట్టాలంటూ వరంగల్ జిల్లా మంత్రి పీఏ ఫోన్..
- ఖమ్మం జిల్లా మంత్రి అనుచరులు కూడా..
- మైనింగ్ శాఖ ఉన్నతాధికారి ఒత్తిడి
- అక్రమార్కులకు స్థానిక పోలీసుల వత్తాసు
- రంగంలోకి దిగిన కలెక్టర్ ఎస్పీ
- అర్థరాత్రి హైడ్రామా..
రాష్ట్రంలో ఇసుక మాఫియా బరితెగించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో ఏపీ నుంచి ఇసుక రవాణా చేస్తున్నది. మంగళవారం అర్థరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను భద్రాచలం వద్ద పట్టుకున్న తెలంగాణ ఖనిజాభివృద్థి అధికారులపై మాఫియా బెదిరింపులకు పాల్పడింది. లారీలను విడిచిపెట్టాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పీఏతో పాటూ ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి అనుచరులు ఫోన్ చేయడంతో అధికారులు కలవర పడ్డారు. ఖనిజాభివృద్థి సంస్థ అధికారులు స్థానిక పోలీసుల సహకారం కోరినా మొదట వారు సహకరించలేదని ఒక అధికారి తెలిపారు. అక్రమ రవాణా వ్యవహారాన్ని టీఎస్ఎండీసీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో కలెక్టర్ ఎస్పీని ఆదేశించిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు.

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా గుండాల ఇసుక ర్యాంపు వద్ద భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ డంపులు ఉండటంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. తెలంగాణలో ఏపీ ఇసుకను అమ్మడానికి నిషేధం ఉండటంతో టీఎస్ఎండీసీ వే బిల్లులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కొత్త ఇసుక రీచ్ లను మంజూరు చేయక పోవడంతో హైదరాబాద్ లో ఇసుక కొరత ఏర్పడింది. లారీ ఇసుక రూ. 90 వేలు అమ్ముతున్నారు. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు ఏపీ కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకుని గుండాల రీచ్ నుంచి ఇసుకను హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. తమ లారీలను ఎవరూ పట్టుకోకుండా ఉండేందికు ముందస్తు ప్రణాళికతో కొన్నిలారీల అద్దాలకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను అతికించారు.

ముందుగా అందిన సమాచారం మేరకు తెలంగాణ ఖనిజాభివృద్థి అధికారులు భద్రాచలం సమీపంలో అక్రమ రవాణా చేస్తున్న లారీలను మంగళవారం రాత్రి పట్టుకున్నారు. తాము సీఎం అనుచరులమనీ, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులమని లారీలను అడ్డగించిన అధికారులకు చెప్పారు. అయినప్పటికీ అధికారులు వాటిని వదలక పోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. టీఎస్ఎండీసీ అధికారులు స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించిని మొదట వారు సహకరించలేదు. లారీల వద్ద తమకు రక్షణ లేదని వారు వాపోయారు అయినప్పటికీ పోలీసులు రాక పోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఎస్సీ ఆదేశాల మేరకు పోలీసులు లారీల వద్దకు వచ్చారు.

మంత్రుల పేరుతో ఫోన్ లు..
లారీలను వదలిపెట్టాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పిఏ అధికారులకు ఫోన్ చేయడం వివాదాస్పదమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రికి చెందిన అనుచరులమంటూ మరికొందరు ఫోన్ చేయడం కూడా అధికారులను కలవరపాటుకు గురిచేసింది. అక్రమ రవాణాను అరికట్టాలని గత కొద్ది కాలంగా మంత్రులే తమను ఆదేశించారని, ఇప్పుడు మంత్రుల పేరుతో లారీల వదలిపెట్టాలని కోరడం సముచితం కాదని అధికారులు తమకు ఫోన్ చేసిన వారికి చెప్పారు.

ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారి కూడా టీఎస్ఎండీసీ అధికారులకు ఫోన్ చేసి లారీలను వదలిపెట్టాలని కోరినట్టు అధికార వర్గాలు తెలిపారు. తమ ఎండీ ఆదేశాలను మాత్రమే తాము ఖాతరు చేస్తామని టీఎస్ఎండీసీ అధికారులు మైనింగ్ శాఖ ఉన్నతాధికారికి తెలిపారు.