A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ కు అధికారమిస్తే దోపిడే

  • మరో సారి అభివృద్ధి కి ఓటేయండి
  • ఎన్నికల ప్రచారం లో మంత్రి గంగుల

అభివృద్ధి కావాలంటే ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేసి గెలిపించాలని కరీంనగర్ భారాసా ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 24, 25,3 డివిజన్ అంబేద్కర్ నగర్, శివాజీ నగర్ కిసాన్ నగర్ లలో మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లకు బుద్ధి చెప్పాలని 60 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ తొమ్మిదేండ్లలో చేసి చూపించారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక కరీంనగర్ నియోజకవర్గాన్ని ఊహించని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణను అభివృద్ధి చేయకుండానే, ఇప్పుడు మళ్లీ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని అన్నారు. హైదరాబాద్ సంపద మీద ఆంధ్రా నేతల కన్ను పడిందని, కేసీఆర్ మళ్లీ రాకపోతే సంపదంతా వారు తీసుకువెళతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగులు విరజిమ్ముతున్న తెలంగాణను మళ్లీ గుడ్డి దీపంగా మార్చవద్దన్నారు.బీఆర్ఎస్‌ కు ఓటు వేసి కేసీఆర్‌కు పట్టం కట్టాలని కోరారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కరెంట్,నీళ్లు లేవని, ఫించన్ వచ్చేదికాదని విమర్శించారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని.. అందుకనే తెలంగాణ రావాలని కోట్లాడమని రాష్ట్రం వచ్చాక మన కరెంట్, నీళ్లు, నిధులు వస్తున్నాయని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుకుని హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే మళ్లీ ఆంధ్రా పెత్తనం వస్తాదని తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందామని అన్నారు. తెలంగాణలో మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో చిచ్చుపెట్టి కేసీఆర్‌ను ఓడించి హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేసుకునేందుకు అక్కడి నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, కేవీపీ, షర్మిల, పవన్‌ కల్యాణ్‌లు బీజేపీ, కాంగ్రెస్‌ ముసుగులో హైదరాబాద్‌లో అడ్డా వేశారని పేర్కొన్నారు. ఇక్కడ సంపద పెరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ మాటలు నమ్మి ఓటు వేస్తే భవిష్యత్‌ తరాల నోట్లో మట్టి కొట్టినట్లే అవుతుందన్నారు. నగరాన్ని ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రం నుంచి రూ.వేల కోట్ల నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.

ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. నగరంలో రోడ్లు, మురికికాల్వల అభివృద్ధితోపాటు కేబుల్‌బ్రిడ్జి, మానేరు రివర్‌ ఫ్రంట్‌, ఐటీ టవర్‌, మెడికల్‌ కళాశాల, వేంకటేశ్వర దేవాలయం, ఇస్కాన్‌ టెంపుల్‌ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇన్నాళ్లూ పాలించిన పాలకులు ఎందుకు నగరాన్ని అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే కేసీఆర్‌ చేతులను మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, కార్పొరేటర్లు కుర్ర తిరుపతి ఎడ్ల సరిత -అశోక్ కంసాల శ్రీనివాస్ , నయీమ్, తూము నారాయణ,పసుల చరణ్ బెజగం మధు తీట్ల ఈశ్వరి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.