- డైవర్షన్ పాలిట్రిక్స్ తో దారి మళ్లిందా?
- విచారణకు ఆదేశించిన సీఎం సిట్ దూకుడుకు బ్రేక్ వేశారా?
- మీడియా యాజమాన్యాలు చట్టానికి అతీతులా
మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హననం కేసులో సిట్ దూకుడుకు స్వయంగా ముఖ్యమంత్రే బ్రేక్ వేశారా? దర్యాప్తునకు ఆదేశించిన ముఖ్యమంత్రే మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారా? డైవర్షన్ పాలిట్రిక్స్ లో భాగంగా ఈ వ్యవహారం దారి మళ్లిందా? మరి అఖిల భారత సర్వీసు అధికారుల మనోభావాల సంగతేంటి? ప్రస్తుతానికి ఇవన్నీ బదులు రాని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
మహిళా ఐఏఎస్ లతో పాటూ రాష్ట్రంలోని ఒక సీనియర్ మంత్రిపై ఎన్టీవీ సహా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన కథనాలు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తనపై వచ్చిన కథనాలపై సంబంధిత మంత్రితో పాటూ ఇద్దరు మహిళా ఐఏఎస్ లు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఐఏఎస్ ల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఎన్టీవీపైనా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. వార్తా కథనానికి బాధ్యులంటూ ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయగా వారు బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే ఆంధ్రజ్యోతిలో సింగరేణి టెండర్ల కుంభకోణం ప్రచురితమైంది. ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి అల్లుడి కంపెనీకి లబ్ది చేకూర్చడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పావులు కదిపారని దీని సారాంశం. టెండర్లలో పోటీ దారుడైన మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని కించ పరచడానికి ఒక కథనాన్ని ప్రసారం చేశారని కూడా ఆంధ్రజ్యోతి రాథాకృష్ట తన ‘తొలిపలుకు’ లో రాశారు.
కథనానికి బాధ్యులెవరు?
ప్రింట్ మీడియాలో ప్రచురించే ప్రతి అక్షరానికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేసే కంటెంట్ కి యాజమాన్యానిదే కీలక బాధ్యత. వీటికి అనుమతుల నిచ్చే సమయంలో కూడా అటువంటి డిక్లరేషన్ ఉంటుంది. మరి ఎన్టీవీ కథనంలో విషయంలో కేవలం జర్నలిస్టులను అరెస్టు చేసి యాజమాన్యాన్ని వదలి పెట్టడంపై సర్వత్రా విమర్శలు పెల్లుబుకాయి. ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. యాజమాన్యాలు చెప్పిందే పత్రికల్లో రాయాలి. యాజమాన్యాలు చెప్పిందే ఛానల్స్ లో ప్రసారం చేయాలి. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. వివాదాస్పద కంటెంట్ ను ప్రసారం చేసిన ఎన్టీవీ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పవచ్చు. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నఎన్టీవీ యాజమాన్యం జోలికి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడిందా లేక ప్రలోభాలకు గురైందా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎన్టీవీ యజమానులు చట్టానికి అతీతులా?
చట్టం ముందు అందరూ సమానులే అనేది ప్రాథమిక న్యాయ సూత్రం కాగా ఇది కొందరికి వర్తించదని అనేక సార్లు నిరూపణ అయింది. ఎన్టీవీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక దశలో దూకుడుగా వ్యవహరించిన ‘సిట్’ ఎన్టీవీ యాజమాన్యాన్ని కూడా విచారణకు పిలుస్తారని అందరూ ఆశించారు. కానీ కథనంలో సంబంధంలేని జర్నలిస్టులను అరెస్టు చేసి చేతులు దులుపుకోవడంతో పోలీసు యంత్రాంగం నవ్వుల పాలైంది. చట్టాల్ని అమలు చేసే ఐఏఎస్ అధికారుల విషయంలోనే న్యాయం జరగక పోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రతి ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీవీ కథనం విషయంలో సీనియర్ జర్నలిస్టులు ,సివిల్ సొసైటీ బాధిత ఐఏఎస్ లకు బాసటగా నిలిచింది. వ్యక్తుల ప్రయివేటు జీవితాల్లోకి తొంగి చూడటం, ఎటువంటి ఆధారాలు లేని కథనాలను ప్రసారం చేయడం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తేలాలంటే ఎన్టీవీ యాజమాన్యాన్ని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘సిట్’ దూకుడుకు సీఎం బ్రేక్..
మహిళా ఐఏఎస్ ల కేసు విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడిన ‘సిట్’ మొదట దూకుడు ప్రదర్శించినా ఆ తర్వాత నీరు కారిపోయింది. ‘సిట్’ ఏర్పాటుకు ఆదేశించిన ముఖ్యమంత్రే మళ్ళీ యూ టర్న్తీసుకున్నారని తెలుస్తోంది. ఐఏఎస్ ల కథనంతో చెలరేగిన తుఫాన్ బొగ్గు కుంభ కోణం లోకి దారి మళ్ళగా ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైపు వెళ్ళి చివరికి బలహీనపడింది. ఏవో రాజకీయ ఒత్తిడిలు సీఎం పై పనిచేశాయని అర్థమౌతోంది. రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని నడిపించే అఖిల భారత సర్వీసుల అధికారుల కేసునే నీరు కారిస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది.
కేసు బలహీనమైనదా?
మహిళా ఐఏఎస్ లపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనంపై నమోదైన కేసు బలహీనమైనదా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. బాధితులు ఫిర్యాదు చేయక పోవడం, ఎటువంటి స్టేట్ మెంట్లు నమోదు చేయకపోవడం వంటి కారణాలతో జర్నలిస్టులకు బెయిల్ వచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఫిర్యాదు ఇచ్చారు. అయితే మీడియా కథనాలు సమాజాన్ని ప్రభావితం చేసే సందర్భంలో ఫిర్యాదు దారు లేకున్నా సుమోటో కేసు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంది.
వ్యక్తిత్వ హననానికి సంబంధించి మహిళా ఐఏఎస్ లు నేరుగా పోలీసులను ఆశ్రయించలేక పోవచ్చు. ప్రసారం చేసిన కథనంలో వారి పేర్లు లేక పోవడంతో సాంకేతికంగా అది సాధ్యం కాలేదు. తరచుగా మీడియా ఇటువంటి విన్యాసాలు చేయడం పరిపాటిగా మారింది. ఎటువంటి ఆధారాలు లేనప్పుడు పరోక్షంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథనాలు వండి వార్చడం సర్వసాధారణమే. కానీ మహిళల విషయంలో అటువంటి సాహసానికి వడిగట్టారంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందని ఎవరైనా ఊహించగలుగుతారు.
రియల్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ గా మారితే..
ప్రజాస్వామ్యంలో మీడియాను ఫోర్త్ ఎస్టేట్ గా అభివర్ణిస్తారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా కల్పించిన ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్’ కింద మీడియాకు కొంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. పరిమితమైన పరిథితో రాజ్యాంగంలోని ఇతర వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ కించపరిచే అధికారం మీడియాకు లేదు. అయినప్పటికీ మీడియా జోలికి వస్తే ప్రజాస్వామ్యానికి ఏదో నష్టం జరిగిపోయిందనే రచ్చ జరుగుతోంది. దీనికి భయపడి ప్రభుత్వాలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. చట్టాల కన్నా స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో మీడియా సంస్థలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.
వ్యాపారానికి, రాజకీయానికి, మీడియాకి మధ్య గీత చెరిపేయడంతో కొన్ని మీడియా సంస్థలు సమాజానికి భారంగా మారిపోయాయి. మీడియా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛగా నిర్వచనం మారిపోయిన తర్వాత జర్నలిజం గురించి మాట్లాడటం గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలను ఏరినట్లవుతుంది.
సామాజిక బాధ్యతను మరచి..
నేటి మీడియాకు సామాజిక బాధ్యత కంటే వ్యక్తుల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పవచ్చు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తొలినాళ్ళలో పత్రికలు పుట్టగా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మరి కొన్ని పత్రికలు పురుడుపోసుకున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఈ కోవకు చెందుతాయి. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాడులకు వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్ నడిపిన ‘ఇమ్రోజ్’ పత్రిక, సురవరం ప్రతాప్ రెడ్డి నడిపించిన ‘గోల్కొండ’ పత్రికలు ప్రజలకు అండగా నిలిచాయి. ఆధునికి కాలంలో పత్రికల గురించి ప్రజలకు తెలియనది కాదు. ఎలక్ట్రానికి మీడియా వచ్చిన తర్వాత సామాజిక బాధ్యతను, నైతిక విలువలను పూర్తిగా పక్కన పెట్టిన వైనం చూడవచ్చు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీడియాలోకి వచ్చిన తర్వాత ఫోర్త్ ఎస్టేట్ పేరు మారిపోయింది. తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు. ప్రతి అక్షరం వెనుక స్వప్రయోజనమే ఉంటుందని స్పష్టమవుతోంది. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్న సోకాల్డ్ మీడియా యజమానుల వ్యక్తిగత జీవితాల్లోకి బయటి వాళ్ళు కూడా తొంగి చూస్తే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. తమను చూసి అందరూ భయపడాలనే వాతావరణాన్ని మీడియా యజమానులు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రాపకం చాలా వరకూ తగ్గినప్పటికీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న కొందరు వ్యక్తులతో మొత్తం మీడియాకే ప్రమాదం ఏర్పడింది. ఇది మరింత సంక్షోభానికి దారి తీయక ముందే దేశంలోని మేధావులు, సీనియర్ జర్నలిస్టులు నిజమైన మీడియాను బతికించడానికి నడుంకట్టాలి.