A place where you need to follow for what happening in world cup

గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 9న గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ఆగస్టు7,8తేదీల్లో గ్రూప్‌`2 పరీక్ష
నవంబర్‌ 17,18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్షలు

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌ 1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్ష తేదీలను బుధవారం తెలంగాణ పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ జూన్‌ 9న జరగనుంది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21న ప్రారంభమవుతాయి.

గ్రూప్‌ 1 ఎగ్జామ్‌: తెలంగాణ వొచ్చి పదేళ్లు అవుతున్నా, ఒక్కసారి కూడా గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయలేదు. గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మొత్తం 563 పోస్టుల భర్తీకీ టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన వారు గ్రూప్‌ -1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నోటిఫికేషన్‌ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు తాజా నోటిఫికేషన్‌కు ఎలాంటి ఫీజు కూడా చెల్లించనవసరం లేదు. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా గరిష్ఠ వయోపరిమితి 44 నుంచి 46 ఏళ్లకు పెంచారు.

‘గ్రూప్‌-2’ నోటిఫికేషన్‌ వివరాలు
గతంలోనే 783 ‘గ్రూప్‌-2’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను గత ప్రభుత్వం విడుదల చేసింది. కానీ పరీక్ష తేదీలను వాయిదా వేస్తూ వొచ్చింది. చివరగా నవంబర్‌లో గ్రూప్‌ 2 ఎగ్జామ్‌ రీషెడ్యూల్‌ చేయగా..ఎన్నికల షెడ్యూల్‌ కారణంగా ఈ ఏడాది జనవరిలో నిర్వహించడానికి రీషెడ్యూల్‌ చేసింది. అంతలోనే ఎన్నికలు జరగడంతో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిన నియమించింది. ఈ క్రమంలో ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్లు  తాజాగా ప్రకటించారు. మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీవో, తహసిల్దార్‌, సబ్‌-రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌,  అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌,  ఎంపీవో, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

గ్రూప్‌-3 ఉద్యోగాల వివరాలు
తెలంగాణలో  ‘గ్రూప్‌-3’ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ చివరగా 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1363 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, ఆడిటర్‌, సీనియర్‌ ఆడిటర్‌, అసిస్టెంట్‌ ఆడిటర్‌, అకౌంటెంట్‌ పోస్టులను టీఎస్‌ పీఎస్సీ భర్తీ చేస్తుంది. గ్రూప్‌-3 పరీక్షలను నవంబర్‌ 17, 18వ తేదీల్లో నిర్వహించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.