A place where you need to follow for what happening in world cup

సార్ కోసం.. పంచాయితీల్లో ఏకగ్రీవ తీర్మానాలు

0 101

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన సమయంలో సీఎం కేసీఆర్ తాను గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్‌ఎస్‌ను బలపరిచేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కేసీఆర్ గెలుపు చారిత్రాత్మకంగా ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా పంచాయతీలకు పంచాయతీలే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లన్నీ సీఎం కేసీఆర్‌కే వేస్తామని కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో నేతలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ తోపాటు.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ  పంచాయతీ పరిధిలోని ప్రజలు మొత్తం కేసీఆర్‌కు ఓటు వేస్తామని మాచారెడ్డి మండలంలోని  8, పాల్వంచ మండలంలో ఓ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశాయి. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు,  జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట,  అంకిరెడ్డిపల్లి తండా, వెనుకతండా, నడిమితండా,  నెమ్లిగుట్ట తండా, బొడిగుట్ట తండా, మైసమ్మ చెరువు తండా, రాజ్‌ఖాన్‌పేట, పాల్వంచ మండలంలోని మంథని దేవునిపల్లి పంచాయతీ కేసీఆర్‌కు ఏకగ్రవంగా ఓటు వేసేలా తీర్మానాలు చేశాయి. ఇందులో భాగంగా ఆయా పంచాయతీల్లో ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకాలు చేశారు.

తరువాత పంచాయతీ లెటర్‌హెడ్‌పై సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు రాసి సర్పంచులు, ఉప సర్పంచులు సంతకాలు చేశారు. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు,  జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కామారెడ్డి అభివృద్ధికి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. రింగురోడ్డు నిర్మాణంతో కామారెడ్డి అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇటీవల కామారెడ్డికి రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ లీడర్లు పాల్గొన్నారు.  కాగా,  సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్‌లో కూడా బీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తామని అక్కడి గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.9 పంచాయతీల్లో కేసీఆర్‌కు ఓటు వేస్తామని బీఆర్ఎస్ నేతలు తీర్మాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ చేసే తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చూపుతారని కాంగ్రెస్‌ మాచారెడ్డి  మండల అధ్యక్షుడు గణేశ్‌ నాయక్  ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలతో వారు ముందుకెళ్తారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తీర్మానాలకు ఎటువంటి విలువ లేదన్నారు. గ్రామం మొత్తం బీఆర్ఎస్‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తోందని తీర్మానించడం కరెక్ట్‌ కాదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ, భూములను అమ్మకుంటున్న బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నారని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.