A place where you need to follow for what happening in world cup

ఏపీలో శృతి మించిపోతున్న డిజిటల్ క్యాంపెయిన్స్

విజయవాడ, జూన్ 30:ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు డిజిటల్ వేదికలపై ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. ఇంతకు మించి మెట్టు దిగడానికి ఏమి లేదనే స్థాయిలో అవి చెలరేగిపోతున్నాయి.విదేశాల్లో ఉండే యువతి తన పేరు మార్చుకుని ముఖ్యమంత్రి కులం పేరును తగిలించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తోందని అధికార పార్టీ అభిమానులు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఆ యువతి రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేస్తూ తమ మనోభావాలను దెబ్బతీశారనేది అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ఆరోపణ.రెండు రోజుల క్రితం ఆ యువతి వ్యక్తిగత వివరాలు తమకు తెలిశాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎదురుదాడికి దిగింది.

ఈ క్రమంలో రెండు వైపులా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, వాటికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేసిన కామెంట్స్, వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు చూస్తే, సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇంకెంత దిగ జారుతుందనే అనుమానం వస్తుంది.మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాల్లో పార్టీల ప్రచారాల్లో మార్పులు వచ్చాయి. తమ పార్టీ అధికారంలోకి రావడానికి లేదా ప్రత్యర్థి పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి రాజకీయ పార్టీలు రక రకాల ప్రచారాలు చేస్తుంటాయి. ఇటీవల ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారాల్లో, నెగిటివ్ ప్రచారం త్వరగా జనంలోకి వెళుతుందనే సిద్దాంతంతో ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలో పాతాళానికి పడిపోయే స్థాయిలో వారి భాష, విమర్శలు చూసే వారిని విస్తుబోయేలా చేస్తున్నాయిపార్టీలను అధికారంలోకి తీసుకు రావడానికి పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటూ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. తమ క్లయింట్‌ పార్టీ నాయకుల గొప్పలు చెప్పడం కంటే ఎదుటి పార్టీ నాయకుల పై దుష్ప్రచారాలు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా మారింది. దానివల్ల ఎదురవుతున్న పోకడలే ప్రస్తుత పరిస్థితి కారణమని ఖచ్చితంగా చెప్పొచ్చు  పార్టీల నాయకులు కూడా అధికారంలోకి రావడానికి ఎలాంటి అనైతిక మార్గాలనైనాా అనుసరించడానికి వెనుకాడటం లేదు.

ఈ క్రమంలో వ్యూహకర్తల బృందాలు వ్యక్తిగత దూషణలను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం ఏజెన్సీలను ఎంగేజ్ చేసుకోవడం ఈ మధ్య వచ్చిన కొత్త పోకడేమీ కాదు. గతంలో ఇందిరాగాంధీ సమయం నుంచి ఈ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు మనుగడలో ఉన్నాయి.గతంలో ఓటర్లు నియోజకవర్గాల వారీగా, ధనికా పేద వర్గాలుగా మాత్రమే విభజించి ఉండేవారు. స్ట్రాటజిస్టుల సారథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలు మొదలయ్యాక వాళ్లు కులాలుగా, ఆయా కులాలకు చెందిన హీరోల సైకో ఫ్యాన్స్‌గా.. ఎదుటి వర్గాలకు వ్యతిరేకులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని, తద్వారా జరిగే పరోక్ష ఫలితాలను, ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునేలా చేస్తున్నారుఎన్నికల్లో పోటీ చేసే పార్టీ, లేదా తమను ఎంగేజ్ చేసుకున్న నాయకుడి ప్రొఫైల్ పెంచడం, ఆ పార్టీకి లేదా ఆ నాయకుడికి ఒక పాజిటివ్ బ్రాండింగ్ క్రియేట్ చేయడం, తద్వారా వారికి ఒక ఫాలోయింగ్ ఏర్పరిచి ఆ తర్వాత వారికి అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను మరల్చడం వీరి ప్రధాన టాస్క్‌గా ఉంటుంది.

తమను ఎంగేజ్ చేసుకున్న పార్టీ లేదా నాయకుడి పరిధి నిర్ధారించుకొని అందులో ఉండే ఓటర్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో మొదట ఈ బృందాలు మ్యాపింగ్ చేస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే అంతవరకు ఎవరు ఏ పనిలో ఉన్నా చేతిలో మొబైల్‌తో ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికలపై దాదాపు అన్ని వయసులలో అన్ని వర్గాలు, అన్ని కులాల ఓటర్లు అందుబాటులో ఉంటారు. దీనినే తమకు అనుగుణంగా మలచుకుంటున్నారు.ఈ కారణంతోనే ఆన్లైన్ క్యాంపెయిన్ వీరి ప్రధాన యుద్ధభూమిగా మారింది. అక్కడ పదేపదే ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఊరి పేరుతో ఉండే ఫేస్‌బుక్‌ పేజీ కావొచ్చు, మీ పాత మిత్రుల వాట్సాప్ గ్రూప్‌లో కావొచ్చు, వ్యక్తిగత ఆసక్తుల ఆధారంగా కావొచ్చు, చివరకు మీరు ఫాలో అయ్యే ట్విట్టర్ ప్రముఖుడి పోస్టులకు రిప్లైల రూపంలో, స్పందనలతో పదే పదే పోస్టులు పెడుతూ తమ క్యాంపెయిన్ ప్రారంభిస్తారు.చెప్పిందే 10 సార్లు చెప్పడం ద్వారా ఎవరి అభిప్రాయాలనైనా మార్చవచ్చని థియరీని వీరు బాగా నమ్ముతారు.

అందుకే తమ నాయకుడికి అనుకూలంగా , ప్రతిపక్షానికి వ్యతిరేకంగా.. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే పనిలో ఈ కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు తలమునకలై ఉంటాయి. ఈ రాజకీయ ప్రచారాలు లేదా స్లోగన్లు కేవలం పాజిటివ్ ప్రచారాలకు మాత్రమే ఉండేవి. ప్రశాంత్ కిషోర్, సునీల్ కొనుగోలు, రాబిన్ శర్మ లాంటి వ్యక్తులు వచ్చాక ఈ తరహా ప్రచారం ప్రారంభం కాలేదు. గతంలో ఇందిరాగాంధీ గరీబి హఠావో స్లోగన్‌తో ఎన్నికల ప్రచారం చేసేవారు.వాజ్‌పాయ్‌ ఇండియా షైనింగ్‌- భారత్ వెలిగిపోతుందనే స్లోగన్ తో, కాంగ్రెస్ కా హార్ట్ ఆమ్ ఆద్మీకా సాత్ అన్న స్లోగంతో సోనియాగాంధీ, అభి కీ బార్ మోడీ సర్కార్.. అచ్చే దిన్ నినాదాలతో నరేంద్ర మోడీ ప్రచారాలు చేశారు. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థి బలహీనతే తమ బలంగా భావిస్తారు కాబట్టి తామేం చేస్తామో చెప్పడం కంటే ప్రత్యర్థి పై విమర్శల కోరుపించడంపై తాజా స్ట్రాటజిస్టులో దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే క్రమంలో ఈ పాజిటివ్ ప్రచారాల కంటే నెగిటివ్ కంపెయిన్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

“బ్రష్టాచార్ కాంగ్రెస్” పేరుతో నరేంద్ర మోడీ 2014, 2019 ఎన్నికల ప్రచారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ని గద్ద దింపేందుకు నితీష్ కుమార్ “జంగిల్ రాజ్” పేరుతో ప్రచారం చేశారు. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారంటూ “PAY CM ” నినాదాన్ని బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బాగా వాడుకుంది.బహుశా అందుకే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కూడా కామెంట్ చేస్తామన్న దానికంటే ఎదుటి పార్టీ బలహీనతలపై ఉన్నది లేనిది రెండూ ప్రచారం చేయడంతో పాటుగా ప్రత్యర్థి పార్టీ నైతిక స్థైర్యం దెబ్బ తీసే విధంగా వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా పరిణామం ఇప్పటికిప్పుడే వచ్చిందని అనుకోవద్దు. 2019 ఎన్నికలకు పూర్వమే ఈ ధోరణులు మనకు కనిపిస్తాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ప్రధాన ప్రచారాస్త్రం మొత్తం ఒక కులం లక్ష్యంగా సాగింది. పాలక పార్టీ తమ కులానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని, రాజధానిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతోందని, లోకేష్ లక్షల ఖర్చుతో చిరుతిళ్లు తింటాడని, చంద్రబాబుకు కులం తప్ప మరేమీ కనపడదని ప్రచారం చేస్తూ “బైబై బాబు” అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు.

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి పదవ తరగతి పరీక్ష పత్రాలు దొంగలించాడని, ఆయన సోదరి షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు టిడిపి వైసిపిల స్థానాలు తారుమారయ్యాయి. సోషల్ మీడియా ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు మరింత దిగజారాయి. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంటూ నిర్వహిస్తున్న ప్రచారాలు కూడా ప్రధానంగా అధికార పార్టీపై బుదర చల్లేవిగానే ఉంటున్నాయి.మీడియా కార్యకర్తలు మాత్రమే కాదు రెండు పార్టీల ప్రధాన నాయకులు సైతం ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణ చేసుకుంటున్నారు. ఒకాయన మరొకరిని ముసలోడు అంటే, అవతలి నాయకుడు ఇతడిని సైకో అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడగట్టన మేస్తుందా! అందుకే ఆ ఇద్దరు నేతల అనుంగు అనుచరులు, వందల కోట్లు ఇచ్చి నియమించుకున్న వారి సోషల్ మీడియా ఆర్మీలు మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాలను బూతుమయం చేస్తున్నారు.ఇందుకోసం వారు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను పకడ్బందీగా నిర్మించుకొని వాటి ద్వారా విరుచుకు పడుతున్నారు. ఐటిడిపి పేరుతో తెలుగుదేశం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి చింతకాయల విజయ్ కుమార్‌ను దానికి బాద్యుడిగా నియమించింది.

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్వయంగా దానిని పర్యవేక్షిస్తున్నారు అనిచెబుతారు.వైఎస్ఆర్సిపి కూడా మరో సోషల్ మీడియా ఆర్మీని ఏర్పాటు చేసి సజ్జల భార్గవరెడ్డిని దానికి ఇంఛార్జిగా నియమించింది. ఈ నియమకాల ద్వారా రెండు విభాగాలు చేసే ప్రచారాలను ఆయా పార్టీల అధినేతలు నేరుగానే ప్రోత్సహించినట్టు భావించాల్సి ఉంటుంది.సోషల్ మీడియా అంటేనే మారు పేర్లు దొంగ ఖాతాలు.. వెకిలి వేషాలు.. ఇక అందులో మంచి ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ నాయకుల ద్వారా గుర్తింపు లభిస్తుండటంతో చెలరేగిపోతున్నారు.కొంతమంది విదేశాల్లో ఉంటూ రాష్ట్ర రాజకీయాల పైన నాయకుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ స్థానిక చట్టాలకు, విచారణ సంస్థలకు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. వైయస్సార్సీపీ తరఫున పంచ్ ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ తరఫున స్వాతి రెడ్డి అనే మరొకరు విదేశాల్లో ఉంటూ తమ పార్టీకి అనుకూలంగా ప్రత్యర్థ పార్టీ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతుంటారు.డబ్బు కోసమో, రాజకీయ అవకాశాల కోసమో, లేదా తమ పార్టీపై నాయకులపై ఉండే వల్లమాలిన అభిమానంతోను వీరు చేసే అనాలోచిత విమర్శలు, కన్నుమిన్ను కానని పొగరుబోతుతనాన్ని ఉపేక్షించడం కూడా పార్టీల తప్పే అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.