- బుధవారం బాధితుల ఫిర్యాదు
- నివేదిక పంపాల్సిందిగా ములుగు కలెక్టర్ ఎస్పీలకు ఆదేశం
- స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద వివరాలు
సేకరించిన కమిషన్ అధికారులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం గ్రామంలో కుమ్మరి వారిపై ఇటీవల జరిగిన వరుస దాడులపై రాష్ట్ర బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. మూడు తరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడమే కాక తమపై అగ్రకులస్థులు వరుస దాడులకు పాల్పడుతున్నారని బాధితులు బుధవారం బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మూడు తరాలుగా తాము నివసిస్తున్న ఇండ్లకు ముళ్ళ కంచెలు వేసి మూడు రోజుల పాటు నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మొదటి సారి దాడి చేసినప్పుడు, ముళ్ళ కంచెలు వేసినప్పుడు పోలీసులు కేసులు పెట్టి ఉంటే వరుస దాడులు జరిగేవి కాదని వారు తెలిపారు. స్థల వివాదంలో పోలీసులు తలదూర్చడమే కాక అగ్రకులస్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు. 60 సంవత్సరాల క్రితమే తమ పూర్వీకులు కొనుగోలు చేసిన భూమి తమ ఆధీనంలో ఉన్నదని, గతంలో అక్కడ కుండలు చేసుకుని జీవించేవారమని తెలిపారు.

ఇటీవల బర్రెలను కట్టివేసి పాలు అమ్ముకుని జీవిస్తున్నామని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల అగ్రకులస్థులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డామని వివరించారు. దాడిలో తమకు తగిలిన గాయాలతో పాటూ గతంలో తమ గుమ్మాలకు కంచెలు వేసిన ఫోటోలను కూడా ఫిర్యాదుతో జత పరిచారు. అగ్ర కులస్తులతో కుమ్ముకైన అధికారులు తమ ఆధీనంలో ఉన్న భూమికి పొసెషన్ సర్టిఫీకెట్ ఇవ్వడం లేదని తెలిపారు. బాధితలు వాంగ్మూలాన్ని కమిషన్ అధికారులు నమోదు చేశారు.
వారికి తగిలిన దెబ్బలను, ఫొటోలను చూసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యుడు తిరుమలగిరి సురేందర్ చలించిపోయారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కమిషన్ అధికారి వెంకటాపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి వివరాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును ఫొటోలతో సహా జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కు పంపించారు.
ఫిర్యాదుపై వారం రోజుల్లో నివేదికలు పంపాలని వారిని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ నుంచి నివేదికలు అందిన తర్వాత పూర్తి స్థాయి విచారణ ప్రారంభిస్తామని, అవసరమైతే సంఘటనా స్థలాన్ని సందర్శిస్తామని కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ ‘రేలా న్యూస్’ కి తెలిపారు.