A place where you need to follow for what happening in world cup

 చంద్రబాబుతో డిప్యూటీ సీఎం కొడుకు భేటీ

విజయనగరం, జూన్ 30:ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వారసుల పోరుతో వేడెక్కుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో 2024 ఎన్నికల్లో ఆశావహులుగా వారసుల పేర్లు బయటకు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ విధివిధానాలు ఆ పార్టీలోని నేతలకే మింగుడు పడటం లేదు. ఐదేళ్ల పాలనలో సగం కాలానికే పరిమితమైన మంత్రి పదవులు, అనుభవం వచ్చేసరికి పదవుల నుంచి వైదొలిగిపోవడం ఆ పార్టీ నేతలు లేని అనారోగ్యానికి చేదు గుళికలు మింగిన చందాన సందిగ్ధ వ్యవస్థ నడుస్తోంది.ఓవైపు పార్టీ అధినేత వింత పోకడలు, మరోవైపు వారసుల ఇంటి పేరుతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారసత్వ రాజకీయం, ఒకే ఇంట్లో రాజకీయాలకు వేదిక కావడం వంటి అంశాలపై వ్యతిరేకిస్తున్న జగన్ ఆలోచన విధానాలు ఇష్టం లేకపోయినా ఆమోదించాల్సిన దుస్థితి నేతల్లో ఏర్పడింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులా 2024 ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. జగన్ ప్రభుత్వంలో నేతల అసంతృప్తిని, వారసుల ప్రాధాన్యతను ఉపయోగించుకొని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలో రాజకీయ వారసులు లేని నేతల్లో ఒక విధమైన అభద్రతాభావం ఉంటే రాజకీయ వారసులు ఉన్న నేతల్లో మరో విధమైన ఒత్తిడి కొనసాగుతోంది.రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందోనని అధికార పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. నాయకులను సంక్షేమ పథకాల ప్రచారానికే పరిమితం చేసిన జగన్ ఆలోచన ఏ విధంగా మారుతుందోనని నేతల బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.

వైసిపి పార్టీ విధానాలతో ఆ పార్టీ నేతల వారసులు తమ భవిష్యత్తు కోసం తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారు. తమకు అవకాశాలు లేనట్లయితే ఏదో ఒక దారిలో తమ రాజకీయ రంగ ప్రవేశానికి దారులు వెతుకుతున్నారు. ఉన్న పార్టీలో భవిష్యత్‌కి గ్యారెంటీ లేకపోవడంతో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపు వారసుల చూపు మరలుతోంది.ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటికి వెళ్లారు.

ఆ సమయంలో చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవి భేటీ కావడం ఫోటోలు దిగడం కొత్త రాజకీయాలకు తెర లేపుతుందనడంలో సందేహం లేదు. తండ్రి కీలకమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా కుమారుడు ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఈ తరహా పరిణామాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.