A place where you need to follow for what happening in world cup

వరాలపై ఆరా! ఎన్నికల వేళ.. పార్టీల హామీల వల

  • ఓట్ల కోసం పోటాపోటీ వరాలు
  • హద్దుమీరుతున్న ప్రకటనలపై ఈసీ నిఘా?
  • మేనిఫెస్టో ప్రకటన తర్వాత వివరణ?

తెలంగాణలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అధికార, విపక్ష పార్టీలు ప్రకటిస్తోన్న వరాలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న ఆయా పార్టీలు.. హద్దులు దాటి హామీలివ్వడం.. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామంటూ.. ఎవరి ఊహకందని వరాలు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. కాగా ఇప్పటికే అధికార బీఆర్ఎస్​పార్టీ అయితే ఏకంగా మేనిఫెస్టోనే ప్రకటించగా.. ఇటు కాంగ్రెస్​, బీజేపీ సైతం మేనిఫెస్టో రూపకల్పనలో తలమునకలైంది. ఇప్పటికే కాంగ్రెస్​ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో ఇటీవల బీఆర్ఎస్​ప్రకటించిన మేనిఫెస్టో విపక్షాలు, ఇతర పార్టీలతో పాటు ఓటర్లనూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలింగ్​సమీపిస్తున్నకొద్దీ ఆయా పార్టీలు హామీల వర్షం ముమ్మరం చేశాయి.

60 శాతం నిధులు మేనిఫెస్టో అమలుకే..
బీఆర్ఎస్​ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయాలంటే ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం నిధులు కేవలం వీటి కోపమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ కార్యాలయ నిర్వహణ, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాప్రతినిధుల వేతనాలు, పెన్షన్ల ఇతర ఖర్చులకు మిగిలిన నిధులు ఎటూ సరిపోని పరిస్థితి నెలకొంటుంది. గెలుపే లక్ష్యంగా.. హామీలు, వరాలు కురిపిస్తున్న పార్టీలు తాము అధికారంలోకి వచ్చాక వాటి అమలు విషయంలో అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకుంటారోననే చర్చ రాజకీయ. అధికార వర్గాలతో పాటు ప్రజల్లోనూ జోరుగా సాగుతోంది. అప్పుల తెలంగాణలో వాటి అమలు ఆచరణకు సాధ్యమేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్​ నేరుగా రంగంలో దిగింది. ఆయా పార్టీలు ప్రకటిస్తోన్న వరాలపై ఆరా తీస్తున్నకమిషన్.. వాటిని ఎలా అమలు చేస్తారోననే సమాచారం ఆయా పార్టీల నుంచి రాబట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్​మేనిఫెస్టోను లోతుగా అధ్యయనం చేసిన కమిషన్ కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటించనున్న మేనిఫెస్టోలనూ లోతుగా పరిశీలించనుంది.

మేనిఫెస్టోల ప్రకటన తర్వాత వాటి అమలు సాధ్యాసాధ్యాలపై ఆయా పార్టీల నుంచి వివరణ కోరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఇప్పటికే ఈ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయా అభ్యర్థులు గెలవాలంటే అంచనాలకు మించి ఖర్చు చేయకతప్పని పరిస్థితి నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల సంఘం నిబంధన ఉంది. కానీ వాస్తవంగా ఎన్నికల ఖర్చు లెక్కలను దాచి పెడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కో సెగ్మెంట్లో రూ.50 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఆచరణ అసాధ్యమే!
ఇప్పటికే అప్పుల పాలైన తెలంగాణలో పోటాపోటీగా కొనసాగుతున్న వరాలు, హామీల అమలు ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో రూ.5లక్షల కోట్ల అప్పుల పాలైన విషయం తెలిసిందే. ఏటా క్రమంగా పెరుగుతోన్న రాష్ట్ర బడ్జెట్​ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.2.77లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు ఆయా పార్టీలు పోటాపోటీగా ప్రకటిస్తోన్న వరాలు, హామీలు అమలు చేయాలంటే ప్రస్తుత బడ్జెట్​ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్​ ప్రకటించిన 6 గ్యారంటీలను పరిశీలిస్తే.. రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు, వరికి ఎకరానికి రూ.15వేలు ఇస్తామని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ భూమి 1.43 కోట్ల ఎకరాలుండగా 58.33 లక్షల మంది రైతులున్నారు. వీరికి ఏటా రూ.40 వేల కోట్లు అవసరముంటాయి. రైతులకు ప్రకటించిన రూ.2లక్షల రుణ మాఫీ కోసం రూ.30వేల కోట్లు అవసరముంటాయి. ఇటు బీఆర్ఎస్​సైతం రైతుబంధు కింద ఇస్తున్న రూ.10 వేల నగదు సాయాన్ని క్రమంగా రూ.16వేలకు పెంచుతానని మేనిఫెస్టోలో ప్రకటించింది.

ప్రతిమహిళకు రూ.2,500 సాయం ఇస్తామని కాంగ్రెస్​ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90.14 లక్షల రేషన్​ కార్డులుండగా ఆ మేరకు నెలకు రూ.2,250 కోట్లు.. ఏడాదికి రూ.27వేల కోట్లు అవసరం. ఇటు బీఆర్ఎస్ సైతం సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల గౌరవ వేతన హామీ ఇచ్చింది. గ్యాస్​సబ్సీడీ కింద కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పోటాపోటీగా వరాలు ప్రకటించాయి. కాంగ్రెస్​ రూ.500లకే గ్యాస్ ఇస్తానని చెబితే.. బీఆర్ఎస్​ఏకంగా రూ.400లకే ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు కోటి వరకు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్​ధర రూ.900 ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్​ఒక్కో గ్యాస్​పై రూ.400 కోట్ల సబ్సిడీ భరించాల్సి వస్తుంది. ఇటు బీఆర్ఎస్ రూ.500 భరించాలి. ఆసరా పెన్షన్ల పై ఇరు పార్టీలు హద్దుకు మించి హామీలిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు రూ. 2వేలు అందుతున్నాయి. బీఆర్ఎస్​ఆసరా పెన్షన్లు రూ.5 వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్​రూ.4 వేలకు పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తుండగా.. బీఆర్ఎస్​ప్రకటించిన హామీ నెరవేర్చాలంటే రూ.24వేల కోట్లు కేటాయించాలి. అన్నిటికీ మించి రాష్ట్రంలో నిరుద్యోగ ఓటర్లను ఆకర్శించేలా కాంగ్రెస్​రూ.4వేల నిరుద్యోగ భృతి ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 37 లక్షల పైచిలుకు మంది నిరుద్యోగులు ఉండగా వారి కోసం నెలకు రూ.148 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన 1200 మంది అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్​రూ.25వేల పెన్షన్​ప్రకటించగా దానికి నెలకు రూ.3కోట్ల నిధులు అవసరముంటాయి.

Leave A Reply

Your email address will not be published.