A place where you need to follow for what happening in world cup

మోడీ, రాహుల్ ​ఎన్నికల​ టూరిస్టులు

0 275
  • రాష్ట్రంపై కేసీఆర్​కు ఉన్న ప్రేమ వారికి ఉంటుందా?
  • కేసీఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతున్నారు
  • అందుకే బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి
  • డబ్బులు పంచుతూ దొరికిన రేవంత్.. డబ్బుపై శపథం చేయడం విడ్డూరం ​కేటీఆర్
  • బీఆర్ఎస్​లోకి జిట్టా, మామిళ్ల రాజేందర్, రావుల చంద్రశేఖర్ రెడ్డి

రాష్ట్రంపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ, ప్రధాని మోడీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉండదని, వారు కేవలం ఎలక్షన్ టూరిస్టులు మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనతో అన్ని వేళల్లో ఉండే వ్యక్తి కేసీఆర్ అని, అలాంటి వ్యక్తికే తెలంగాణ ప్రజలు మరోసారి పట్టం కడతారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో తెలంగాణ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కేటీఆర్ సమత్రంలో బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతున్నారన్న భయం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. అందుకే కేసీఆర్ ను తెలంగాణకే కట్టడి చేయాలని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఎన్ని విధాలుగా కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు గెలిపించేది బీఆర్ఎస్ నేనని స్పష్టం చేశారు.

ఓట్ల కోసం మెడీ, రాహుల్​ అబద్ధాలు..
ఎన్నికలు రావడంతో నాలుగు ఓట్ల కోసం మోడీ, రాహుల్ గాంధీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేత‌లు అజ్ఞానంతో మాట్లాడుతున్నార‌ని, తాము ఎవ‌రికి ఏ టీం, బీ టీం కాదన్నారు. తెలంగాణ ప్రజల టీం అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అని విమర్శించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆయన నిప్పు అయ్యారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ అవ‌స‌రానికి కండువా మార్చుకుంటే తామంతా మారాలా? అని నిలదీశారు. తెలంగాణ ఆకాంక్షలను మొద‌టి నుంచి అణిచివేసింది కాంగ్రెస్సేనని కేటీఆర్ మండిపడ్డారు. బీసీ జ‌న గ‌ణ‌న చేయాల‌ని అడిగితే మోడీ పెడ‌చెవిన పెట్టారన్నారు. సాగు, తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, క‌ల్యాణ‌లక్ష్మి ఇస్తున్నందుకు బీఆర్ఎస్​ను ఓడించాలా అని ప్రశ్నించారు.

రేవంత్ పై ధ్వజం..
రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అమర వీరుల స్తూపం దగ్గరకు రమ్మని కేసీఆర్ కు సవాల్ విసిరడం విడ్డూరంగా ఉందని, దీన్ని చూస్తుంటే హంతకుడే నివాళులు అర్పించినట్లుగా ఉందని విమర్శించారు. డబ్బులు పంచుతూ దొరికిన రేవంత్ రెడ్డి డబ్బులపైన శపథం చేయడంపై ఎద్దేవా చేశారు. కలికాలంలో విచిత్రాలు జరగుతాయని, రేవంత్ తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోందని పేర్కొన్నారు. భారత దేశంలో ఒక తెలంగాణ మాత్రంమే కేసీఆర్ చేతిలో ఉందని, మిగతా రాష్ట్రాలు బీజేపీ, కాంగ్రెస్ చేతిలో ఉన్నాయన్నారు. మరీ తెలంగాణకు చేతనైనా అభివృద్ధి మిగతా రాష్ట్రాలకు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. జిట్టా పార్టీలోకి వస్తే.. తప్పిపోయిన కొడుకు సాయంత్రం ఇంటికొచ్చినట్లు ఉందని, తెలంగాణ ఉద్యమ సయంలో భువనగిరిలో ముందుంది నడిపింది జిట్టానే అని కేటీఆర్ అన్నారు. అలాంటి ఆయన అప్పటి నుంచి పార్టీలో ఉండి ఉంటే పైళ్ల శేఖర్ రెడ్డి భువగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండేవారు కాదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల మందరం కలిసి కష్టపడి తెచ్చిన తెలంగాణను కాపాడుకుందామని కేటీఆర్​అన్నారు.

Leave A Reply

Your email address will not be published.