మోదీని ఓడించాలి కాంగ్రెస్ జెండాను ఎగురెయ్యాలి
కెసిఆర్ మాదిరిగానే అక్రమ అరెస్ట్‌లకు తెరలేపిన మోదీ
రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర
బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటే..కెసిఆర్‌ను ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదు
జనజాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఎవరి పౌరుషం ఏమిటో తెలుసుకునే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం నిర్వహించిన జన జాతర సభ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావ్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ…పదేళ్లు అధికారంలో ఉన్న జయశంకర్ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్‌గా మార్చలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్‌గా మార్చి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కార్యకర్తల బాధ్యత తీరలేదని, వారి బాధ్యత ఇంకా మిగిలే ఉందని సూచించారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఫైనల్స్ అని, ఫైనల్స్‌లో మోదీని ఓడిరచి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మూలంగా వరంగల్‌కు ఔటర్ రింగు రోడ్డు రాలేదని, రావాల్సిన ఎయిర్ పోర్టును మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రావలసిన హామీలపై ప్రశ్నించిన తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, గతంలో కేసీఆర్ తనను అక్రమంగా అరెస్టు చేసినట్లే…మోదీ కూడా అదే పద్ధతి అవలంబిస్తున్నారని మండి పడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని, అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ కోరుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ బిసి జనగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వెల్లడిరచారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం తనను వివిధ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం గాంధీభవన్‌కు దిల్లీ పోలీసులను పంపించారని, తనను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించారని అన్నారు. జన జాతర సభా వేదికగా బీజేపీ నాయకులకు సవాల్ విసురుతున్నానని గుజరాత్ పెత్తనమా..? తెలంగాణ పౌరుషామా? తేల్చుకుందామని రేవంత్ సవాల్ చేశారు. రాజాకార్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకుందని, దిల్లీ పోలీసులను కాదు..సరిహద్దులో సైనికులను తెచ్చుకో..భయపడేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మనం గెలవాలి.. మనం నిలవాలని పిలుపునిచ్చారు.
ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి బస్సు యాత్ర ప్రారంభించారని, టిఆర్‌ఎస్‌కు 12 సీట్లు ఇస్తే హంగ్ వొస్తుందని.. నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారని, బిజెపి, బిఆర్‌ఎస్ అంతర్గత ఒప్పందంలో భాగంగానే కెసిఆర్ అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇండియా కూటమిలో కేసీఆర్‌ను చేర్చుకునే ప్రసక్తి లేదని, కెసిఆర్ కలిసేది బీజేపీ తోనే అనే విషయం స్పష్టమైందని అన్నారు. మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగానే బీజేపీ, బీఆరెస్ ఒక్కటే వెల్లడిరచారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఎన్నికల తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపించారు.
బీఆరెస్‌కు ఒక్క వోటు వేసినా.. అది మురిగిపోతుందని వోటర్లకు సూచించారు. కారు కారా?నాకు పోయిందని, ఇక దాన్ని జుమ్మేరాత్ బజార్‌లో తూకానికి అమ్మాల్సి ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. కడియం కావ్యను రెండు లక్షల మెజారిటీతో గెలిపించాలని, వరంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ సభలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ధనసూరి అనసూయ(సీతక్క), ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి తదితరులు పాల్గొని మాట్లాడారు.