వారు పదేళ్లు పాలిస్తే మాపై అప్పుడే విమర్శలా…
పాలమూరు బిడ్డ సిఎం కావడం తట్టుకోలేకపోతున్నారు
రాష్ట్రం కోసం మోదీతో అయినా..కెడీతో అయిన కొట్లాడుతా
మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా
కేంద్రంతో ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం
కెసిఆర్‌ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు
కాలు ఇరిగిందని చెప్పి..ఇంట్ల కూర్చుని విమర్శలు చేస్తున్నాడు
బిఆర్‌ఎస్ ప్రభుత్వ వేసిన చిక్కుముళ్లు విప్పుకుంటూ ముందుకు..
30 వేల ఉద్యోగాల భర్తీతో యువతకు భరోసా కల్పించాం
పాలమూరు బహిరంగ సభ వేదికగా ఎన్నికల శంఖం పూరించిన సిఎం రేవంత్ రెడ్డి
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహిం చిన ’పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని తాను ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటానని, తాను కూడా సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని అన్నారు. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగా ల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని, ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చామని, ఆయితే అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్టాల్రు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని అన్నారు. కేటీఆర్, హరీష్ రావును చూస్తే.. బిఆర్‌ఎస్ ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుందని, పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతానని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.