A place where you need to follow for what happening in world cup

కీలక నేతలపై పోటీకి బీజేపీ సీనియర్లు

తెలంగాణ బీజేపీ .. బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈ సారి బీఆర్ఎస్ కీలక నేతలపై తమ పార్టీ ముఖ్య నేతలను  నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితా రెడీ అయిందని.. ఈ జాబితాలో పదిహేను నుంచి ఇరవై వరకూ పేర్లు ఉంటాయని.. అన్నీ సంచలన అభ్యర్థిత్వాలేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  కేసీఆర్ పై గజ్వేల్ లో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈటల రాజేందర్ చాలా కాలంగా చెబుతున్నారు. అంతే కాదు ఆయన గజ్వేల్ తరచూ పర్యటిస్తున్నారు. ఒకప్పటి సహచరులు అయిన వీరు పోటీ పడితే .. ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ పేరును ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో కేటీఆర్ పై సిరిసిల్లలో పోటీ చేసేందుకు  బండి సంజయ్ పేరును ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.

బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కేటీఆర్ కు బలమైన  పోటీ ఇవ్వాలంటే బండి సంజయ్ సరైన అభ్యర్థిగా భావించడంతో ఆయననే నిలబెడుతున్నారని చెబుతున్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన కూడా కేసీఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు.కేసీఆర్, కేటీఆర్ లపై మాత్రమే కాకుండా.. బీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న వారందరిపైనా బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేయనున్నారు. హరీష్ రావుపై సిద్దిపేటలో మాజీ ఎంపీ బూర నర్సయ్య్ గౌడ్ ను నిలబెట్టాలనే  ఆలోచన చేస్తున్నారు.    రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణను పోటీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

బీఆర్ఎస్ నేతల్లో మంత్రులపై పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు హైకమాండ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యులపై కీలక నేతల్ని పోటీకి పెడితే ఆయా స్థానాలపై ప్రత్యేకమైన హైప్ వస్తుంది.  పోటీ కూడా ముఖాముఖిగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేసులో లేకుండా పోతారని భావిస్తున్నారు. దీని వల్ల బీజేపీకి మేలు జరుగుతుందనే అంచనాలో ఉన్నారు. ఇవే కాదని.. బీజేపీ వచ్చే ఎన్నికల్లో మరిన్ని కీలకమైన వ్యూహాలను అమలు చేయబోతోందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కూడా పోటీ చేయడం ఖాయం. అయితే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు.. ఎవరైనా బీఆర్ఎస్ కీలక నేతపై పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.