A place where you need to follow for what happening in world cup

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

సజావుగా ఎన్నికలు నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి
భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ పర్యటన

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డిజిపి రవిగుప్తా అధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాదు నుండి హెలికాప్టర్‌ ద్వారా చర్ల మండలం చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లిలో గల పోలీసు భద్రతా బలగాల క్యాంపులను సందర్శించారు. డీజిపితో పాటు అడిషనల్‌ డీజీపీ ఇంటిలిజెన్స్‌ శివధర్‌ రెడ్డి, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ విజయ్‌ కుమార్‌, సిఆర్పిఎఫ్‌ సౌత్‌ జోన్‌ అడిషనల్‌ డీజిపి రవిదీప్‌ సింగ్‌ సాహి, సిఆర్పిఎఫ్‌ సౌత్‌ సెక్టార్‌ హైదరాబాద్‌ జోన్‌ ఐజిపి చారుసిన్హా, ఎస్‌ఐబి ఐజీపి సుమతిలు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. క్యాంపుల సందర్శనలో భాగంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి డీజిపి పలు సూచనలు చేశారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని, అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వలన రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం హెలికాప్టర్‌ ద్వారా సారపాక ఐటీసి గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని అక్కడ భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు జిల్లాల ఎస్పీలతో ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిజిపి  మాట్లాడుతూ…చెక్‌ పోస్ట్ల వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమంగా నగదు, మద్యం రవాణాను అడ్డుకోవాలని సూచించారు.

గత ఎన్నికల్లో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం డిజిపితో పాటు అధికారులందరూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు, ములుగు ఎస్పీ డా.శబరీష్‌, భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ ఖరే, ఎస్‌ఐబి ఎస్పీ రాజేష్‌, ఓఎస్డి కొత్తగూడెం సాయి మనోహర్‌, భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్‌ జితే, ట్రైనీ ఐపిఎస్‌ విక్రాంత్‌ సింగ్‌, సిఆర్పిఎఫ్‌ అధికారులు ఆర్‌.కె పాండా, ఎం.కె మీనా, మోహన్‌, రితేష్‌ కుమార్‌ మరియు డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.