A place where you need to follow for what happening in world cup

ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా.. ఆగస్ట్‌ 15లోపు..  రూ.2 లక్షల రైతు రుణమాఫీ ..!

రా… వొస్తావా.. టచ్‌ చేసి చూడు మసైపోతావ్‌…
 కెసిఆర్‌కు రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌..
 మెదక్‌ గడ్డపై బలహీనవర్గాల బిడ్డ నీలం మధును గెలిపించండి..
 బీఆర్‌ఎస్‌, బిజెపిలు ఎవరికి టికెట్లు ఇచ్చాయో ఆలోచించండి..
 రైతుల పాలిట దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి
 పరిశ్రమలు, నిధులెన్ని తెచ్చాడో రఘునందన్‌ రావు చెప్పాలి
 మెదక్‌కు 10 ఏళ్లలో కేసీఆర్‌, అల్లుడు హరీష్‌ రావు చేసిందేమీలేదు..
 ఇందిరా గాంధీ హయాంలోనే పరిశ్రమలు..ఉపాధి అవకాశాలు..
 మెదక్‌ సభలో  సీఎం రేవంత్‌ రెడ్డి

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ సాక్షిగా చెబుతున్నా..ఆగస్టు 15లోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులైన రైతులందరికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వొచ్చే సీజన్‌లో వరి పంటకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించారు. శనివారం మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోసం మెదక్‌లో కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ మాజీ ముఖ్యమంత్రి ,బి ఆర్‌ ఎస్‌ అధినేత కె .చంద్ర శేఖర్‌ రావు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ .. రా.. వొస్తా వా.. రా..టచ్‌ చేసి చూడు…ముట్టుకుని చూడు..మాడి మసై పోతావు.. ఇక్కడ ఉన్నది అల్లా టప్పా.. కాదు…అయ్యా… తాత పేరు చెప్పుకుకుని రాలేదు..తొక్కుకుంటు ఈ సీట్‌ దాకా వొచ్చినం..ఇంకో పదేళ్లు అధికారంలో ఉంటాం..అన్ని పనులు చేస్తాం.. అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, మెదక్‌ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు, బిఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామా రెడ్డిపై రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ నామినేషన్‌, మీటింగ్‌కు వొచ్చిన అశేష జనాల్లో ఉత్సాహం, ఊపును చూస్తే అభ్యర్థి నీలం మధు గెలుపుపై తనకు నమ్మకం కలిగిందన్నారు.

పేదింటి బిడ్డ నీలం మధుకు కాంగ్రెస్‌ పార్టీ అరుదైన అవకాశం ఇచ్చిం దని సీఎం పేర్కొన్నారు. అదే మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌, బిజెపిలు ఎవరికి టికెట్లు కేటాయించాయో? ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు, ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో మోదీ పీఎంగా ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమిటో చూపాలన్నారు. పీఎం మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌ మెదక్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధపు మాటలతో వోట్లు అడగడానికి వొస్తున్నారని సీఎం ఘాటుగా విమర్శించారు. మెదక్‌ ప్రాంతానికి వేలాది పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్‌ హయాంలోనే అని గుర్తు చేశారు. నాడు కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. ప్రధాని ఇందిరాగాంధీ బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌, ఇక్రిశాట్‌ తదితర పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించిందని స్పష్టం చేశారు. ఇకపోతే టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఒక దుర్మార్గుడు కాదా..అంటూ ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితుల భూములను లాక్కున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎంపీ టిక్కెట్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాంతానికి కష్టపడి పని చేస్తున్నటువంటి మదన్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకపోవడంపై ఒకసారి ఆలోచన చేయాలన్నారు.

కేసీఆర్‌ ముదిరాజులను డి గ్రూపు నుంచి ఏ గ్రూపులోకి మార్చేందుకు కనీస ప్రయత్నమైనా చేశారా..అంటూ ప్రశ్నించారు. 1999 నుంచి 2024 వరకు 25 ఏళ్లు బిజెపి, బీఆర్‌ఎస్‌ చేతుల్లోనే ఈ పార్లమెంట్‌ ఉందని, ఈ ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్‌ వోటు వేయాలని అభ్యర్థించారు. ఇందుకు ముదిరాజ్‌, సబ్బండ బిడ్డలంతా ఏకమై ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్‌ అంటున్నారు..కానీ పదేళ్లు ఇక్కడే ఉంటాం..ఎవరు వొస్తారో రండి చూసుకుందామని సవాల్‌ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్‌ పిట్టల దొరలా మారారని..ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పదేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, పదేళ్లు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పవర్‌లో ఉందని, కానీ ఇద్దరూ కలిసి మెదక్‌కి చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జెండా, అజెండా మార్చినా రెండు తోడు దొంగల పార్టీలే అని విమర్శించారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు..ఒక్క రూపాjైున వేశారా అని ప్రశ్నించారు. దిల్లీలో రైతులను చంపిన బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పేదలకు ఎప్పుడు అండగా నిలబడేది మూడు రంగుల జెండానే అని అన్నారు.

మోదీ, కేసీఆర్‌ ఎప్పుడూ మెదక్‌ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మెదక్‌ అభివృద్ధికి ఏం చేశారో చెప్పి రఘునందన్‌ రావు, హరీష్‌ రావు వోట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే రఘునందన్‌ రావుకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో దుబ్బాకను అభివృద్ధి చేశానని చెబుతున్నాడని, తాము బస్సులు వేసుకుని వొస్తాం దుబ్బాక అభివృద్ధి చూపిస్తావా అని రేవంత్‌ సవాల్‌ చేశారు. దుబ్బాక నుండి రంగు మార్చి మెదక్‌ వొచ్చాడని విమర్శించారు. సిఎస్‌ఐ గ్రౌండ్‌ నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు సీఎం రోడ్‌ షోతో మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం పర్యటించారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెలిక్యాప్టర్‌ ద్వారా మెదక్‌ లోని సీఎస్‌ఐ గ్రౌండ్స్‌కు చేరుకున్న సీఎంకు మంత్రులు, నాయకులు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మెదక్‌ జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రికి పూల బొకేలు అందించి, ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ప్రచార వాహనంలో మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌తో కలిసి రామదాస్‌ చౌరస్తా వరకు రోడ్‌ షో నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌, ఎమ్మెల్యే రోహిత్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆవుల రాజిరెడ్డి, మదన్‌ రెడ్డి, నర్సారెడ్డి, కాటశ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, పూజారి హరి కృష్ణ, ఆంజనేయులు గౌడ్‌, మెదక్‌ కాంగ్రెస్‌ నేతలు, నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.