A place where you need to follow for what happening in world cup

మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

  • మణిపూర్ వీడియో తమను తీవ్రంగా కలచివేసిందన్న సీజేఐ
  • ఘటనపై సుమోటాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం
  • వీడియోను తొలగించాలని సామాజిక మాధ్యమాలకు కేంద్రం ఆదేశం

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడులకు గురిచేస్తున్న భయానక వీడియో ఘటనపై సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. నేరస్తులపై చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుషార్‌ మెహతా విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సూచించారు.

ఈ ఉదయం కోర్టు సమావేశమైనప్పుడు, ఏజీ, ఎస్జీ లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి ‘ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోల గురించి తెలిసి మేం చాలా బాధపడ్డాం. దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కలహాల ప్రాంతంలో లింగ హింసను ప్రేరేపించడానికి మహిళలను సాధనంగా ఉపయోగించడం తీవ్ర కలత కలిగిస్తోంది. ఇది అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన’ అని పేర్కొన్నారు.

ఈ వీడియో మే 4వ తేదీ నాటిదని కోర్టుకు తెలుసన్న సీజేఐ దాని వల్ల తమ అభిప్రాయంలో ఎలాంటి తేడా ఉండదన్నారు. ‘దీనిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మేం కొంత సమయం ఇస్తాం, లేకుంటే మేమే చర్యలు తీసుకుంటాము’ అని సీజేఐ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. కాగా, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.