A place where you need to follow for what happening in world cup

సిద్దిపేట ఐటి టవర్ ప్రారంభం రేపే

0 1,373
  • ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభానికి సర్వం సిద్ధం
  • రూ. 63 కోట్ల వ్యయంతో సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణం
  • ఈనెల 15న ఐటీ టవర్ ప్రారంభం
  • సిద్దిపేటకు మరో ప్రత్యేక గుర్తింపు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: అభివృద్ధిలో దూసుకుపోతున్న సిద్దిపేటలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు మరో వేదిక సిద్ధమైంది. ఐటీ కొలువుల కోసం ఇక హైదరాబాదు వెళ్ళనవసరం లేకుండా స్థానికంగానే ఆ కొలువులు సాధించుకోవడానికి విద్యార్థులకు అవకాశం లభించింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి (రాజీవ్ రహదారి)పై ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది దీంతో సాఫ్ట్వేర్ కొలువుల కోసం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహించారు. 63 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఐటీ సౌదాన్ని ఈ నెల 15న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తోపాటు ఎంపీ, ఎమ్మెల్సీలు ఐటీ శాఖ అధికారులు పాల్గొననున్నారు. దాదాపు 11 ఐటీ కంపెనీలు ఈ టవర్ లో ప్లేస్మెంట్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పనులు చేయించనున్నాయి. అందుకోసం ఈనెల 13న మెగా జాబ్ మేళా ను ఐటి టవర్ పక్కనే ఉన్న పోలీస్ కమిషనరేట్ లో ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఐటీ టవర్ విశిష్టతలు
సిద్దిపేట సమీపాన నాగుల బండ వద్ద మూడు ఎకరాల 26 గుంటల స్థలంలో ఐటీ టవర్ ను నిర్మించారు 1,72,642 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంలో నాలుగు అంతస్తులో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టారు. ఒకేసారి 718 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా సీటింగ్ సదుపాయం కల్పించారు. మొదటి అంతస్తులో కిచెన్,క్యాంటీన్, ఈవెంట్ హాల్స్, కాన్ఫరెన్స్ రూమ్స్, కౌన్సిలింగ్ రూమ్స్, లెక్చరర్ హాల్స్ ఉంటాయి. రెండవ మూడవ నాలుగవంతస్తుల్లో 718 ఉద్యోగులు పనిచేయడానికి సీటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించడానికి వసతులను కల్పించారు.మొత్తం 2154 మందికి ఉద్యోగాల నిర్వహణకు ఐటీ టవర్ వేదిక కానుంది.

సీఎం సొంత జిల్లాలో ఐటి టవర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత జిల్లా సిద్దిపేటలో ఐటి టవర్ నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటివరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఐటీ టవర్ ను సొంత జిల్లాలో నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో టవర్ నిర్మాణ పనులు పూర్తిచేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఉద్యోగులను నియమించుకున్నాయి సిద్దిపేట ఐటి టవర్ లో దాదాపు 11 కంపెనీలు భాగస్వామ్యం తీసుకొని తమ కంపెనీల్లో ఉద్యోగులను నియమించారు.

సిద్దిపేటకు వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవే
సిద్దిపేట ఐటి టవర్ లో ప్లేస్మెంట్ తీసుకొని తమ కంపెనీలను నడపడానికి ముందుకు వచ్చిన కంపెనీలు అమిడ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓఎస్ఐ డిజిటల్, ఫిక్సిటీ టెక్నాలజీస్, జోలాన్ టెక్, విజెన్ ఇన్ఫోటెక్, థోరాన్ టెక్నాలజీస్-అమెరికా, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్. కామ్ సీఎక్స్ ఐటీ సర్వీసెస్, అమృత సిస్టమ్స్, ఎమ్మెస్ పి ఆర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖలోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్( టాస్క్) ఉమ్మడిగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగులకు అవసరమైన శిక్షణను టాస్క్ ద్వారా అందించనున్నారు.

మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి
ఐటీ టవర్ మంజూరు నుంచి నిర్మాణము పూర్తయ్యే వరకు మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అన్ని తానై వ్యవహరించారు. రాజీవ్ రాదారిపై అటు కలెక్టరేట్, ఇటు పోలీస్ కమిషనరేట్ ,మరోవైపు హరిత హోటల్, ఇంకో వైపు ఎల్.వి.ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మధ్యలో నాగుల బండ వద్ద ఈ ఐటీ టవర్ నిర్మాణానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించడం… పక్కనే హైదరాబాద్ వెళ్లే రాజీవ్ రహదారి ఉండడం.. మరోవైపు సిద్దిపేట హైదరాబాదుకు రైల్వే లైన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండడంతో ఉద్యోగుల రాకపోకలకు మెరుగైన వసతి ఏర్పడింది.


స్థానిక యువతకే ఐటి ఉద్యోగాలు కంపెనీలకు భారీ రాయితీలు
సిద్దిపేటలో నిర్మించిన ఐటీ టవర్ స్థానిక నిరుద్యోగ యువతకు వరంగా మారేలా మంత్రి హరీష్ రావు చర్యలు చేపట్టారు. ఐటీ కంపెనీ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించి టవర్లో సబ్సిడీతో కూడిన సదుపాయాల అందించేందుకు హామీలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.