A place where you need to follow for what happening in world cup

ఉమ్మడి పౌర స్మృతిపై కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు

  • ఉమ్మడి పౌర స్మృతి బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని వెల్లడి
  • దేశంలో ఎన్నో సమస్యలున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని విమర్శ
  • ప్రజలను విభజించేందుకు యూసీసీతో కుట్ర చేస్తోందని ఆరోపణ

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సయిఫుల్లా రెహ్మానీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, తదితరులు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి, యూసీసీని వ్యతిరేకించాలని కోరారు.

ఈ బిల్లును తాము అంగీకరించమని వారికి హామీ ఇచ్చిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రెచ్చగొడుతూ పబ్బం గడిపేందుకే యూసీసీని తీసుకు వస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, దురుద్దేశ్యంతోనే దీనిని తీసుకువస్తోందన్నారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందని, కానీ ఈ ఐక్యతను కేంద్రం చీల్చే కుట్ర చేస్తోందన్నారు. అందుకే తాము దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు.

యూసీసీ బిల్లుతో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, వివిధ మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటు హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. దేశ ప్రజల అస్థిత్వానికి, తరతరాల సంప్రదాయ సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు ఇది గొడ్డలిపెట్టుగా మారుతుందన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.