- కర్నాటక గోస… తెలంగాణకు అవసరమా ?
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుంది
- మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు
ఎన్నికలు రావడంతో….గుంట నక్క మాదిరిగా కాంగ్రెస్ అనేక హామీలను గుప్పిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. హస్తం పార్టీ పొరపాటున అధికారంలోకి వచ్చినా…. రాష్ట్ర మళ్లీ సర్వ నాశనం అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కరెంటు మూడు గంటలకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఇలాగే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ….ప్రస్తుతం మూడు గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. రైతులు రోడ్ల మీద ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అందుకే ప్రజలు విజ్ఞతతో ఈ ఎన్నికల్లో వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ మాయ మాటలకు నమ్మకుండా…. మరోసారి కారును గెలిపించాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులంతా రాత్రింబవళ్లు శ్రమించాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం తెలంగాణ భవన్ లో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి తమ మద్దతుదారులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంతింటికి తిరిగి వచ్చిన సత్యనారాయణ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఓన్ చేసుకోలేదన్నారు. అందరు నాయకులను దూరం చేసుకుందన్నారు. కాగా మళ్లీ అధికారంలోకి రాగానే కేసీఆర్ భరోసా కింద 15 కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ను ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెలుతున్నామన్నారు. విద్యుత్ సమస్య, నీళ్ల సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లా అంతా పచ్చగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు జిల్లాలు పచ్చదనం కనిపిస్తుందన్నారు. ఒకప్పుడు విద్యుత్ అధికారులు రైతుల మోటార్లకు తీగలు కట్ చేసి తీసుకెళ్లేవారని ఆయన గుర్తు చేశారు.
కర్ణాటకలో ఇచ్చిన హామీ మేరకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గంటల పాటు విద్యుత్ ను కూడ వ్యవసాయానికి కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేకపోతుందని కేటీఆర్ విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటకలో నెలకొన్న పరిస్థితులే దాపురిస్తాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే స్వంత రాష్ట్రం కర్ణాటకలోనే ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ విమర్శించారు.. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని కర్నాటక ప్రజలు చెంపలేసుకుంటున్నారన్నారు. ఇందుకు నిరసనగా మొసళ్లను తీసుకెళ్ళి కరెంట్ సబ్ స్టేషన్‌లో రైతులు వదిలిపెట్టారన్నారు. అలాగే వ్యవసాయానికి మూడు గంటల పాటు విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ గుర్తు చేశారు. 24 గంటల విద్యుత్ కావాలా….లేక మూడు గంటల విద్యుత్ అవసరమా తేల్చుకోవాలని రాష్ట్ర ప్రజలను కేటీఆర్ కోరారు. 11 దఫాలు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ప్రజలను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు.