కాషాయ పార్టీ క్యాడర్ లో జోష్ నింపడానికి ప్రణాళికలు రూపొందించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ లు ప్రకాశ్ జవదేవకర్, సునీల్ బన్సాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17న హైదరాబాద్ విమోచన వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో తెలంగాణ మూడు వైపుల నుంచి భారీ రథయాత్రలకు ప్లాన్ చేశారు. బాసర నుంచి హైదరాబాద్ వరకు ఒక ముఖ్య నేత నేతృత్వంలో యాత్ర.. సోమశిల నుంచి హైదరాబాద్ వరకు మరో ముఖ్య నేత ఆధ్వర్యంలో యాత్ర.. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు ఇంకో ముఖ్య నేత లీడ్ చేస్తూ యాత్ర నిర్వహించనున్నారు. 19 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర యాత్రలు సాగనున్నాయి.
క్యాడర్ లో జోష్ నింపడమే లక్ష్యంగా బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎవరు ? ఎక్కడ నుంచి ? బస్సు యాత్రలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ చెరో వైపు నుంచి యాత్ర చేయడం కన్ఫర్మ్ అయ్యింది. మూడో వైపు నుంచి యాత్ర ఎవరు చేయాలనే దానిపై సందిగ్దత నెలకొంది. బండి సంజయ్, డీకే అరుణ ఇద్దరిలో ఎవరితో బస్సు యాత్ర చేయించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఉత్తర, దక్షిణ ధృవాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని మండల స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవలే ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించి క్షేత్రస్థాయి రిపోర్ట్ ను అధిష్టానానికి అందించారు. వారు ఇచ్చిన రిపోర్ట్ లపై సమావేశంలో చర్చించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న నెగటివ్ విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. సనాతన ధర్మంపై తమిళనాడు ఉదయ్ నిధి వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల13న ఉదయం 11 గంటల నుంచి, 14 తేదీ ఉదయం వరకు నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై 24 గంటల పాటు నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15న సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 17వ తేదీన ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాతీయ పతాకం ఎగురవేయాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యాక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ కారణాలతో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందన్ తదితరులు సమావేశానికి హాజరుకాలేదు. మొత్తంగా కమలనాథుల ప్రణాళికలు ఘనంగానే ఉన్నా.. ఏ మేరకు కార్యక్షేత్రంలో అమలు చేస్తారో చూడాలి.
ఎన్నికలకు సంబంధించి 22 కమిటీలు
తెలంగాణపై బీజేపీ ఫోకస్‌ను క్రమంగా పెంచుతోంది. ఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీలను నియమించే ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సాల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికలకు సంబంధించి 22 కమిటీలను వేయాలని నిర్ణయించారు. అందులో కీలకమైన ప్రచార కమిటీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై శుక్రవారం విస్తృతంగా చర్చించారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పనిచేస్తున్నారు.
ఆయనకు ధీటుగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగింది. మునుగోడు ఎన్నికల ఓటమి తర్వాత ఇన్ యాక్టివ్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డిని యాక్టివ్ చేయడానికి ఈ పదవి ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అధిష్టానానికి డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు పేర్లను రాష్ట్ర నాయకత్వం పంపినట్లు సమాచారం.ఇక మ్యానిఫేస్టో కమిటీ బాధ్యతలు మాజీ ఎంపీ వివేక్ లేదా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మ్యానిఫేస్టో కమిటీలో మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ లకు అవకాశం కల్పించనున్నారు.
ఇక మీడియా కమిటీతో పాటు మొత్తం 22 కమిటీలను ప్రకటించడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను ఖాళీగా ఉంచకుండా పార్టీకి వినియోగించుకోవాలని లెక్కలు వేస్తున్నారు. కమిటీ కసరత్తు దాదాపు పూర్తయ్యింది. అధిష్టానం ఆమోద ముద్ర వేసి విడుదల చేయడమే తరువాయి అన్నట్టుగా ఉంది.దీంతో మొత్తానికి నేతలకు పనివిభజనలో భాగంగా కీలకమైన నేతలందరికీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అయితే ఎవరి పనులు వారు చేసుకుంటారో.. ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకుని చిందరవందర చేసుకుంటారో చూడాల్సి ఉంది. తెలంగాణపై బీజేపీ పెట్టిన నజర్ ఏమేర ఫలిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే