A place where you need to follow for what happening in world cup

ఇసుక బ(ది)లి

  • మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి ‘బీఎం ఎక్కా‘కు స్థాన చలనం
  • నియమించిన ఐదు నెలలకే వేటు
  • జార్ఖండ్ ఆదివాసీ తెగకు చెందిన అధికారి
  • చక్రం తిప్పిన మంత్రి
  • ఇసుక కేటాయింపుల్లో అనుచరుల మాట పెడ చెవిన పెట్టినందుకే
  • గాడిలో పెడుతున్న సమయంలోనే
  • గత ప్రభుత్వం లోనూ లూప్ లైన్ లోనే

మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నియమించిన ఐదు నెలలకే సీనియర్ అధికారికి స్థాన చలనం కలిగించడం ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపింది. మహేశ్ దత్ ఎక్కాకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనగా ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ ను మైనింగ్ శాఖ కార్యదర్శిగా నియమించింది. ‘ఎక్కా’ బదిలీకి కారణమేమిటో ప్రభుత్వం బహిరంగంగా చెప్పక పోయినా ఇసుక అనుమతుల వ్యవహారమే కారణమని తెలిసింది. మైనింగ్ సహా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే వివిధ శాఖలపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, జీఎస్టీ, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ శాఖల ద్వారా ప్రభుత్వానికి ఆశించిన మేరకు ఆదాయం రావడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే కేవలం మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శినే బదిలీ చేయడంలో ఆంతర్యమేమిటనే అభిప్రాయం పలువురికి కలుగుతున్నది. నిజానికి గత ఏడాది కన్నా మైనింగ్ ఆదాయం పెరిగిందని అధికార వర్గాలంటున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక సహా కొత్త మైనింగ్ విధానం అమల్లోకి తెస్తారని అందరూ ఆశించారు. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి అడుగులూ వేయలేదు. దీనికి సంబంధించిన అధ్యయనం కూడా జరగలేదు. ఇంతలోనే లోక్ సభ ఎన్నికలు కూడా వచ్చాయి. మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానే కాక తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ వైస్ చైర్మెన్ మేనిజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బీఎం ఎక్కా ఇసుక సహా ఇతర ఖనిజాల ఆదాయం పెంచడానికి తన వంతు కృషి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్ల వద్ద పెండింగ్ లో ఉన్న ఇసుక అనుమతులు ఫైళ్ళను క్లియర్ చేయించారు. ఇతర ఖనిజాలకు సంబంధించిన పెండింగ్ లీజు మొత్తాలు, అపరాథ రుసుములు వసూలు చేయించే పనిలో పడ్డారు. ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం పెంచడంలో ప్రధాన పాత్ర మైనింగ్ శాఖ డైరెక్టర్ ది కాగా ముఖ్య కార్యదర్శి కేవలం పెండింగ్ అప్పీళ్ళ పరిష్కారం, విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ గా పనిచేసి ఏపీకి వెళ్ళిన అధికారిని తెలంగాణ కు తీసుకు రావడమే కాక మైనింగ్ శాఖ డైరెక్టర్ గా నియమించడం పై ఆ శాఖ అధికారులే తప్పు పట్టారు.

Benhur Mahesh Dutt, Principal Secretary, Mining Department

ఈ విషయంలో ముఖ్య కార్యదర్శిని సంప్రదించకుండానే ఆ శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏండ్ల తరబడి బదిలీలకు నోచుకోని మైనింగ్ శాఖ అధికారులను పెద్ద సంఖ్యలో ఇటీవల బదిలీ చేసింది. వీరికి కొత్త పోస్టులలో ఇంకా అవగాహన రాలేదు. గత 45 రోజులుగా ఎన్నికల కోడ్ పేరుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. అటువంటప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి ఏమీ చేయలేదని నెపం వేయడం ఎంత వరకూ సమంజసమని తోటి అధికారులే అంటున్నారు.

మైనింగ్ మాఫియా పాత్ర…
ములుగు జిల్లాలో పట్టా భూముల పూడిక పేరుతో గోదావరిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్న కొందరు దళారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై రెండు రోజుల క్రితమే ముఖ్య కార్యదర్శి విజిలెన్స్ దర్యాప్తు చేయించారు. ఈ దర్యాప్తులో అక్రమాలు బయట పడడంతో చర్యలకు ఉపక్రమించే పనిలో ఎక్కా నిమగ్నమై ఉన్నారు. ఈ దశలో బదిలీ వేటు పడడం అనేక అనుమానాలకు తెరలేపుతున్నది. మైనింగ్ మాఫియా ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రిని ఆశ్రయించినట్టు తెలిసింది.

ఖమ్మం జిల్లా మణుగూరు, పినపాక, అశ్వాపురం, చర్ల, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల్లో గోదావరిలో ఇసుక రీచ్ ల కోసం మంత్రి అనుచరులు ఇటీవల ప్రయత్నాలు చేశారు. రీచ్ లను తమకు కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మంత్రి పేరుతో ఫైళ్ళను పెండింగ్ లో పెట్టడంతో ముఖ్య కార్యదర్శి జోక్యం చేసుకుని వాటికి అనుమతులను జారీ చేయించారు. గోదావరి తీర ప్రాంతానికి చెందిన మరొక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇసుక పైరవీలు మొదలు పెట్టారు. చర్ల ప్రాంతానికి చెందిన కీలకమైన ఒక ఫైల్ విషయంలో ముఖ్య కార్యదర్శిపై ఒత్తిడి పెంచారు. కొన్ని ఫైళ్ళను ఆపివేయాలంటూ మంత్రి హుకుం జారీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలోనూ…
1995 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా జార్ఖండ్ రాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన వారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే గత ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసి లూప్ లైన్ లో పెట్టింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. చాలా కాలం తర్వాత మంచి పోస్టింగ్ వచ్చిందనుకున్న తరుణంలో ఐదు నెలలకే అకారణంగా ఆయన్ని బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం పై ప్రతిపక్షాలు కూడా ఆరా తీస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.