A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే అవినీతి

0 2,633
బీజేపీపై విష ప్రచారం..
పార్టీని కాపాడుకోలేని కేసీఆర్‌ వోట్లు ఎలా అడుగుతారు?
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో ప్రజల్లో అసహ్యం..
తెలంగాణలో బీజేపీకి డబుల్‌ డిజిట్‌ ఖాయం 
25న కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన 
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి

అవినీతి అనేది కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని, పెద్దఎత్తున యువత బిజెపిలో చేరుతున్నారని, దీనిని ఓర్వలేక కేసీఆర్‌ కూతరుకు బెయిల్‌ ఇప్పించేందుకు 5 సీట్లలో సుపారీ తీసుకున్నారని రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీలు మారడంపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆ బాధ, ఆవేదన కేసీఆర్‌ లోనూ కనిపిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయి 5 నెలలు గడిచినా ఇంకా కేసీఆర్‌, కేటీఆర్‌ తమ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల వెన్నుపోట్లు..పార్టీ నుంచి వలసలు.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం, కూతురు లిక్కర్‌ స్కామ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ సతమతమవుతుందని తెలిపారు. వీటిని తట్టుకోలేక బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు. కేటీఆర్‌..జై శ్రీరామ్‌ అంటే ఉద్యోగాలు రావని, అన్నం పెట్టదని మాట్లాడుతున్నాడని, జై శ్రీరామ్‌ అనండి..బిజెపిని తొక్కండని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేటీఆర్‌ తండ్రి మాజీ సీఎం కేసీఆర్‌ను గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు బిజెపి జెండా పట్టుకొని తొక్కిన విషయం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు.

ప్రజస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారని, ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్‌..ఏ మొహం పెట్టుకుని ఎంపీ ఎన్నికల్లో వోట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కేవలం డిపాజిట్ల కోసమే యత్నించాలని, గెలవడానికి కాదన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా అయోమయంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికలకు మందు సోనియమ్మ, ఇందరిమ్మ రాజ్యం వస్తుందని మరోసారి, రాహుల్‌ గాంధీ రాజ్యం వొస్తుందని ఇంకోసారి..ఇలా అనేక రకాలుగా గ్యారంటీల పేరుతో గారడీ చేసి రేవంత్‌ రెడ్డి వోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. వందరోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్లీ మాట మారుస్తున్నారని ఆరోపించారు. జూన్‌ 4 వరకు ఎన్నికల కోడ్‌ ఉందని, జూన్‌ 5 నుంచి అయినా ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని అన్నారు. గత ఎన్నికల్లో 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలను పచ్చిగా మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసిన కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో వోటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు.

రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి గ్యారంటీలు ఇచ్చి..100 రోజుల్లో నెరవేరుతుందని చెప్పారని, కానీ ఇచ్చిన హామీలు, గ్యారంటీలపై కాంగ్రెస్‌ నాయకుల నోరు మూగబోయిందని ఎద్దేవా చేశారు. గ్యారంటీలు అమలు చేసేంతవరకు ప్రజలు కాంగ్రెస్‌కు వోటు వేయొద్దని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు కూడా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతగా వ్యవహరించలేదని, కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను నాడు కేసీఆర్‌ ప్రభుత్వంలోకి పంపారని విమర్శించారు. ఈరోజు బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌..కాంగ్రెస్‌ లోకి పంపుతున్నారని, కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పార్టీలు నరేంద్ర మోదీ పట్ల, బిజెపి పట్ల పెరుగుతున్న ప్రజాదరణపై జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. కేసీఆర్‌ కూతరుకు బెయిల్‌ ఇప్పించేందుకు బీజేపీ 5 సీట్లలో సుపారీ తీసుకున్నారని రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలోనూ రేవంత్‌ రెడ్డియే బెయిల్‌ ఇప్పిస్తారా..? సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ కుమార్తె అరెస్టు విషయం రాష్ట్ర రాజకీయాలకు, లోక్‌ సభ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కేవలం బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి గతంలో వచ్చిన 40 సీట్లు కూడా వొచ్చే పరిస్థితి లేదని, అవినీతి కాంగ్రెస్‌ పార్టీకి వోటు వేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.

వొచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆర్‌ జీ ట్యాక్స్‌ వసూలు చేసి దిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ దొందూ దొందే అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బడేభాయ్‌ అయితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ చోటే భాయ్‌ అని అన్నారు. కేసీఆర్‌ మూలాలన్నీ కాంగ్రెస్‌ లోనే ఉన్నాయని, కాంగ్రెస్‌తో కలిసి కాపురం చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని, నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటేస్తే వృథా అవుతుందని, ఆ పార్టీ గెలిచినా ఆ పార్టీ ఎంపీలు బీఆర్‌ఎస్‌లోనే ఉంటారనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో లేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన బీఆర్‌ఎస్‌ వొచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చూపించదని జోస్యం చెప్పారు. వొచ్చే నాలుగున్నరేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందని, కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లో తిరగలేరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలే కాకుండా అమలు చేయాల్సినవి 400 హామీలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతోనే అని అన్నారు.

తమిళనాడులో డీఎంకే పేరుతో, యూపీలో సమాజ్‌ వాదీ పార్టీతో, దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో..ఇలా అనేక ముసుగు పార్టీలతో కాంగ్రెస్‌ నిలదొక్కుకునే యత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 స్థానాల్లో నాలుగింటిని బిజెపి గెలవబోతుందన్నారు. తెలంగాణలోనూ డబుల్‌ డిజిట్‌ సీట్లను బీజేపీ గెలవబోతుందని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 70 శాతం మంది యువత నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. బిజెపి పట్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు బేస్‌ లెస్‌ మాటలు, గాలిమాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీని నిలదీయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు రానున్నారని తెలిపారు. 21, 22వ తేదీల్లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్‌ బన్సల్‌ తెలంగాణలో పర్యటించనున్నారని తెలిపారు. పెద్ద సభలు, సమావేశాల కంటే తాము ఇంటింటికి వెళ్లే కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి సారించామని, ఇప్పటికే బిజెపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ముందున్నారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇలానే మే 13వ తేదీ వరకు నిర్మాణాత్మకంగా బిజెపి ప్రచార కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

తెలంగాణపై బిజెపి ప్రత్యేక దృష్టి
అగ్రనేతల ప్రచారానికి షెడ్యూల్‌ సిద్ధం
ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాల పర్యటనలు

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫోకస్‌ పెంచింది. డబుల్‌ డిజిట్‌ టార్గెట్‌గా రాష్ట్రంలో ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు రాన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఇందు కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశర చేశారు. ఇక తాజాగా మరోసారి ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని పర్యటించిన ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, మల్కాజ్‌గిరి సభల్లో పాల్గొనగా ఈ నెల చివరి వారంలో రాష్ట్రంలో మరోసారి పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. మోదీ రాక సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో మోదీ పర్యటనను దిగ్విజయం చేసేందుకు కషాయం దళం కసరత్తు చేస్తున్నది. ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు నేతలు. ఇక ఈ నెల చివరి వారంలో ప్రధాని మోదీతోపాటు అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సభలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.