A place where you need to follow for what happening in world cup

మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం..

0 127

రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీనే..
రేవంత్‌ రెడ్డి రైతు రుణ మాఫీ కాదు కనీసం పెన్షన్లు కూడా ఇవ్వలేదు
మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

ముచ్చటగా మూడవసారి కూడా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని, భవిష్యత్‌లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా ప్రచారంలో ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో ఓబీసీల సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. జహీరాబాద్‌ పార్లమెంటుకు బీబీ పాటిల్‌ కూడా మూడవసారి ఎంపీ కావడం తథ్యమని, ఒకప్పుడు తాను, బీబీ పాటిల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నామని, అప్పట్లో కేసీఆర్‌.. తెలంగాణ పట్ల తనకున్న యావ ఇంకెవరికీ లేదన్నాడని, కానీ ఈసారి ఆ మాట చెప్పే అర్హత ఆయనకు లేదన్నారు. రెండుసార్లు అధికారం ఇచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తోటి మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా అగౌరవపరిచారని తెలిపారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటేస్తే దానికి విలువ పోతుందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు మంచి జరగాలంటే బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని చెప్పారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు ఉందని, అబద్ధపు హామీలతో  రేవంత్‌ రెడ్డి గద్దెనెక్కారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నాలుగు నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తల నరుక్కుంటా అంటూ బూటకపు మాటలు చెప్పారని, చివరికి హైదరాబాద్‌ భూములు అమ్ముకోగా వొచ్చిన డబ్బుతో రైతుల రుణమాఫీ కాదు కదా, వాటి వడ్డీలు కట్టడానికే సరిపోయిందన్నారు. రేవంత్‌ రెడ్డి అయితే ఏకంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, అప్పులు తీసుకోని రైతులను రుణాలు కూడా తీసుకోమని చెప్పారని, కానీ ఇప్పటి వరకూ రుణమాఫీ చేయలేదు సరికదా, పెన్షన్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కల్యాణ లక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తానని అబద్ధపు హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ఈ హామీలన్నీ తెలంగాణ నుంచి 17 ఎంపీలను గెలిపిస్తేనే జరుగుతాయని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతాడని చెప్తున్నాడని విమర్శించారు.

శాసన సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదంటూ శ్వేతపత్రం జారీ చేశారని, కేసీఆర్‌ అప్పులు మాత్రమే మిగిల్చాడని, చిప్ప చేతికిచ్చాడని ప్రజలకు చెప్పాడని, రేవంత్‌ రెడ్డి ఎలాంటి హామీలు నెరవేర్చబోయేది లేదని, కేవలం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నాడని అన్నారు. ఎలాగైనా ఎంపీ ఎన్నికలలో గెలవాలని లేనిపోని మాటలు చెప్తున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు వోటు వేస్తే ఆయన ఎంపీ అయితే నేరుగా ప్రధాని మోదీ వద్దకు పోయి జహీరాబాద్‌కు కావలసిన నిధులు తెచ్చిస్తాడని చెప్పారు. మన ప్రధాని మోదీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా 12 కోట్ల టాయిలెట్లు కట్టించారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత ప్రభుత్వం పనిచేసి ఉంటే నేడు తెలంగాణలో పేదలందరికీ పక్కా ఇళ్లు వొచ్చేవని అన్నారు.

కేందప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, రైతు బంధు, రైతు బీమా, ఇన్సూరెన్స్‌ స్కీములెన్నో ప్రవేశపెట్టారని తెలిపారు.  రైతులతో పాటు రైతు కూలీలకు కూడా ఇన్సూరెన్స్‌ ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ పేదల కోసం ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఎకౌంటు ఉండాలనే ఉద్దేశంతో జన్‌ ధన్‌ ఖాతాలు తెరిపించారని చెప్పారు. ఈ కారణంగా ప్రతీ చిన్న వ్యాపారి వద్ద, బ్యాంకు ఎకౌంట్ల ద్వారా, ఫోన్‌ పేల ద్వారా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు.   అమెరికా, రష్యాలను తలపించే విధంగా దేశవ్యాప్తంగా ఎన్నో రోడ్లు వేస్తున్నారని, గతంలో అమెరికాలో మన నాయకులని, సాక్షాత్తూ మన ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ కలామ్‌నే చెక్‌ చేసి అవమానపరిచారని, అలాంటిది ఇప్పుడు ప్రధాని మోదీ హయాంలో ఆయనకు, భారతీయలకు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా అవినీతి లేదని, గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అనేక స్కామ్‌లు జరిగాయని తెలిపారు. బీబీ పటిల్‌ను, కమలం పువ్వు గుర్తుకి వోటు వేసి గెలిపించాలని ఈటల రాజేందర్‌ కోరారు.

Leave A Reply

Your email address will not be published.