A place where you need to follow for what happening in world cup

ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం…

  • దేశ ప్రజలకు మోదీ మాయమాటలు
  • బీజేపీ ఏజ్‌ లిమిట్‌ అమలు చేస్తే తర్వాత ప్రధాని ఎవరు?  
  • పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం..
  • కొడంగల్‌లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ఈ లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలో తమ వందరోజుల పాలనకు రెఫరెండమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.5 శాతం వోట్లు వొచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకు మించి వొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కొడంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సెప్టెంబర్‌ 17, 2025తో మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, ఒకవేళ ఏజ్‌ లిమిట్‌ అమలు చేస్తే ప్రధాని ఎవరు అనేది బీజేపీ తేల్చుకోవాలన్నారు. ఈసారి దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుందని, మరి  400 సీట్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ..మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని విమర్శించారు.

దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని, సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ముస్లిమ్‌ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారని, ఇండియా కూటమి పేరుతో తాము ప్రజలను వోట్లు అడుగుతుంటే…బీజేపీ మాత్రం మోదీ పేరుతో వోట్లు అడుగుతుందని..ఎవరు నామ్‌ దార్‌..ఎవరు కామ్‌ దార్‌ దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారనే దానిపై చర్చకు తాము సిద్ధమని రేవంత్‌ సవాల్‌ విసిరారు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్‌ నడుస్తుందని, మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవని తెలిపారు. నవనీత్‌ కౌర్‌ 15 సెకన్ల కామెంట్స్‌పై చర్యలు లేవని, బీజేపీ నేతలపై ఎంహెచ్‌ఏ కంప్లైంట్‌ చేయదని ఆరోపించారు. కానీ ఒక వీడియో వైరల్‌ కేసులో తమపై ఎంహెచ్‌ఏ రంగంలోకి దిగిందని తెలిపారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు.

బీజేపీ వాషింగ్‌ మెషిన్‌లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయని, కాంగ్రెస్‌కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నానని, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. అలాగే పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ అసాధ్యమైన టాస్క్‌ కాదని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తుందని, యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌పై తనకు సానుభూతి ఉందని, మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారని, కేసీఆర్‌ కూడా కేఏ పాల్‌ మాదిరిగానే మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.