A place where you need to follow for what happening in world cup

మల్లన్న సాగర్‌లోకి గోదావరి జలాలు

  • కాళేశ్వర ఎత్తిపోతల వద్ద మోటర్లు ఆన్‌
  • ‌తమ పోరాటం ఫలించిందన్న బిఆర్‌ఎస్‌

‌మల్లన్నసాగర్‌లోకి సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. రంగనాయక సాగర్‌ ‌నుంచి మల్లన్నసాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నది. కాగా కాళేశ్వర జలాల విడుదలపై తమ పోరాటం ఫలించిందని బీఆర్‌ఎస్‌ ‌ప్రకటించుకుంది. గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా రాజకీయ కక్షతో ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయలేదని ఇప్పటికే ఆ పార్టీ ఆరోపించింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు ఉద్యమ బాటపట్టారు. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు హెచ్చరికలతో దిగివచ్చిన ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నదని ఆ పార్టీ తెలిపింది.

వర్షాభావ పరిస్థితులతో సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లు వట్టిపోతున్నాయని, కాళేశ్వర జాలాలతో వాటిని నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ప్రభుత్వం అనంతగిరి రిజర్వాయర్‌ ‌నుంచి నీటిని ఎత్తిపోసే పక్రియను ప్రారంభించింది. మంగళవారం రెండు మోటర్లను ఆన్‌చేయడంతో గోదావరి జలాలు రంగనాయకసాగర్‌లోకి పరుగులు పెట్టాయి. 3 టీఎంసీల సామర్థ్యంగల రంగనాయకసాగర్‌లోకి రెండు పంపుల ద్వారా 6600 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.

తాజాగా రంగనాయక సాగర్‌ ‌నుంచి మల్లన్నసాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంతో గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మల్లన్న సాగర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక కొండపోచమ్మ సాగర్‌కు గురువారం రాత్రికి గోదావరి జలాలు చేరనున్నాయి.శనివారం వరకు నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అప్పటి వరకు నీటి లభ్యతను బట్టి గోదావరి జలాలు ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి జలాలతో నింపుతుండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.