A place where you need to follow for what happening in world cup

తెలంగాణ మహిళల ఆరాధ్య పండుగ బతుకమ్మ

0 98
  • తెలంగాణ మహిళలు వెయ్యి సంవత్సరాలుగా జరుపుకుంటున్న పండుగ బతుకమ్మ
  • ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ
  • మహాలయ అమావాస్య తో ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగింపు
  • తొమ్మిది రోజులు పూజలు
  • అందుకోనున్న గౌరమ్మ

అక్టోబరు నెలలో తెలంగాణ ప్రజలకు పండుగల నెల ఈ నెలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి ‘బతుకమ్మ పండుగ’, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఆశ్విజ మాసంలో మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది .బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక.

రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.

తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” పాటల వెనుక ఉండే మర్మం ఇదే.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

బతుకమ్మ కథ,…….
చారిత్రక ఆధార కథ……..

తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు.

ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. సా.శ 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు.

ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు “బొడ్డెమ్మ” (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.