ముద్ర, మల్యాల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (ముత్యంపేట) శ్రీ ఆంజనేయ స్వామివారిని శనివారం బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మహాశక్తి ఆలయం దర్శనం తర్వాత పవిత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆరు రోజులపాటు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో అన్ని మండలాలలో, గ్రామాలలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్రను కొనసాగించేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు పాదయాత్రలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది లేదని విమర్శించారు. దేశభక్తి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నాడు. మరోసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇయ్యాలని తెలిపారు.