- గోదావరి ఇసుక తవ్వకాలపై ఎన్టీటీ స్టే ఎత్తివేతకు నిరాకరణ
- టీజీఎండీసీ దాఖలు చేసిన అప్పీల్ విచారణ దశలోనే డిస్మిస్
గోదావరి ఇసుక తవ్వకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీతమ్మసాగర్ పూడిక పేరుతో పర్యావరణ అనుమతులు లేకుండా ములుగు జిల్లాలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఆగస్టు నెలలో చెన్నైలోని ఎన్టీటీ దక్షిణాది రాష్ట్రాల బెంచ్ స్టే విధించింది. ములుగు జిల్లాకు చెందిన పూనెం రాములు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ లో ఎన్టీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ ఎన్టీటీ తిరస్కరించింది. ఎన్టీటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ ఇటీవల సుప్రీం కోర్టులో సివిల్ అప్పీల్ దాఖలు చేసింది.

(సీఏ నంబర్ 013696/2026). సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె. బాగ్చి, జస్టిస్ వి. మోహన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. అడ్మిషన్ దశలోనే పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ వివాదాన్ని ఎన్టీటీలోనే తేల్చుకోవాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఎటువంటి సాంకేతిక అధ్యయనం చేయకపోవడమే కాక ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం పూడిక పేరుతో దొడ్డిదారిన ఇసుక తవ్వకాలు చేపట్టిందని పిటిషనర్ ఎన్టీటీలో వాదించారు. పర్యావరణ చట్టాలు, సుప్రీం కోర్టు, ఎన్టీటీ తీర్పులకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ ఎన్టీటీ దృష్టికి తీసుకు వెళ్ళారు.