A place where you need to follow for what happening in world cup

ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబ విడుదల

పదేళ్ల జైలు నిర్బంధం తర్వాత జనజీవనంలోకి సాయి
ప్రజాసంఘాల హర్షం.. ఆరుగురిలో ఒకరు మృతి

 గత పదేళ్లుగా మహారాష్ట్ర జైలు నిర్బంధంలో శిక్ష అనుభవిస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా నాగపూర్‌ కేంద్ర కారాగారం నుండి గురువారం విడుదలయ్యారు. సాయిబాబాతో పాటు మరో ఐదుగురు సామాజిక కార్యకర్తలను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్దం చేయడానికి నేరపూరిత కుట్రతో ప్రజలను సమీకరించారని ఆరోపిస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నేరం మోపుతూ పదేళ్ల క్రితం నాగపూర్‌ పోలీసులు దిల్లీ లోని ఆయన నివాసంలో సోదాలు జరిపి, కంప్యూటర్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకొని 2014, మే 9న అరెస్టు చేశారు. దిల్లీ జేఎన్యూ విశ్వవిద్యాలయంలో చైనీస్‌ చదువుతున్న విద్యార్థి, కళాకారుడు హేమ్‌ మిశ్రాను మహారాష్ట్ర బామ్రాఘడ్‌లో 2013లో పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆదివాసీ నిందితుడు పాండు నరోటే విచారణ క్రమంలోనే అనారోగ్యంతో చనిపోయాడు. మరొక ప్రజా మేథావి,  సీనియర్‌ జర్నలిస్టు ప్రశాంత్‌ రాహీ కూడా రెండు తీవ్రమైన ఆరోపణలతో ఏళ్ల తరబడి జైలు నిర్బంధం తర్వాత విడుదలై బయటకు వొచ్చారు.
ప్రశాత్‌ రాహీ మీద 2007లో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాజద్రోహం కేసు మోపి 14 ఏళ్ల విచారణ అనంతరం తర్వాత కొట్టుడుపోయింది. మరోసారి 2013లో మహారాష్ట్ర గడ్చిరోలిలో నమోదైన ఉపా కేసులో జీవిత ఖైదు పడిన కేసు కూడా కొట్టివేయడంతో అమరావతి జైలు నుండి ప్రశాంత్‌ రాహిని గురువారం మధ్యాహ్నం విడుదలయ్యారు. విజయ్‌ టర్కీ ఒక ఆదివాసీ సాధారణ యువకుడు. అసలు అతని మీద ఏ కేసు, ఎందుకు నమోదు చేశారనే విషయంపై అవగాహన లేని సాధారణ అమాయకుడు. ఆయన కూడా ఇంకా విడుదలకు సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. కాగా 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు పై నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. తొంబై శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా నాగపూర్‌ జైలులో శిక్ష అనుభవించారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు బాంబే హైకోర్టు విచారణ చేపటింది. అనంతరం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5 న తీర్పు ఇచ్చింది. ప్రొఫెసర్‌ సాయిబాబా మిగతా సామాజిక ఉద్యమకారుల విడుదలతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక, హక్కులు, రచయితల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Leave A Reply

Your email address will not be published.