A place where you need to follow for what happening in world cup

ప్రజల కోసం మాట్లాడుతుంటాం..కొట్లాడుతుంటాం

  • తెలంగాణకు ఒక గొంతుక అవసరం
  • తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశాం
  • తెలంగాణభవన్‌లో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కెటిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోమనేలా తమ ప్రస్థానం సాగుతుం దని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక గొంతుక ఉండటం అవసరమని, తెలంగాణకంటూ ఉన్న ఒక ఇంటి పార్టీ బీఆర్‌ఎస్‌ అని వెల్లడిరచారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్‌ సార్‌ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయ న్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ ఏర్పాటు చేశారని కేటీఆర్‌  అన్నారు.

కేసీఆర్‌ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారమయిందని, పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమన్నారు. సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) వినిపించిందని చెప్పారు. సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్‌దే అని 2014లో తమ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడిరచారు.

తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు అద్భుతమైన స్పందన లభించిందని వెల్లడిరచారు. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసన్నారు.

బోధించు, సవ్నికరించి, పోరాడు అనే అంబేద్కర్‌ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని వెల్లడిరచారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరికీ, తమకు మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం, వారి ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు, ప్రాణాలు అర్పించి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాదిమంది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటామని, కేసీఆర్‌ చూపిస్తున్న బాటలో మరోసారి పూనరంకితం అవుతామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.