A place where you need to follow for what happening in world cup

ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకొచ్చిన విషయం మరిచిపోతామా?: ఎమ్మెల్సీ కవిత

  • కాంగ్రెస్ నేతలు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు.. అధికారంలోకి వస్తే పట్టించుకుంటారా? అన్న కవిత 
  • తెలంగాణ అంతా గులాబీ హవా కనిపిస్తోందని వ్యాఖ్య 
  • కేసీఆర్ మళ్లీ గెలిచి దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం

అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ అంతా గులాబీ హవా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, తద్వారా దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారన్నారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతో ఉన్నారన్నారు. కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు… కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ఠ అన్నారు.

కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకి వచ్చిన విషయాన్ని మరిచిపోతామా? అన్నారు.  రైతుబంధును రైతులకు బిచ్చమంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, బీమా వృథాగా ఇస్తున్నామని చెబుతున్నారని విమర్శించారు. రేపు అధికారంలోకి వస్తే వీరు ప్రజలను పట్టించుకుంటారా? అన్నారు.

బీఆర్ఎస్, కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారం అన్నారు. గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని ఆమె కోరారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పని చేసినా ఒక్క చెరువును మరమ్మతు చేయలేదన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్… నిజాం సాగర్ కాలువల ఆధునికీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకూ నీరు వస్తోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బోధన్‌ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.