A place where you need to follow for what happening in world cup

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై.. కదులుతున్న డొంక..

  • మరింత ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..
  • కూపీ లాగుతున్న విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు..

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై డొంక కదులుతుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగి కూపిలాగుతున్నారు. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ రిపోర్టులు కూడా తెప్పించుకుని, విజిలెన్స్ దాడుల పరిస్థితులు, న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ జలసౌధ, మేడిగడ్డతో పాటు పలు చోట్ల ఏకకాలంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రైడ్స్ జరిగాయి. ప్రాజెక్టుల్లోని మొత్తం 7 లింక్‌లలో లింక్‌–1 లోని నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిన పనులకు సంబంధించిన కీలక ఫైళ్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయాలు, సవరించిన అంచనాలు సహా సంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన 2016 నుంచి పూర్తయ్యే నాటికి గల రికార్డులు, పత్రాలు, ఫైళ్లను, జీవో కాపీలను అధికారులు సీజ్‌ చేశారు.

ఏఈ నుంచి సీఈ, ఈఎన్సీల స్థాయి వరకూ ఎంతమంది అధికారులు పని చేశారని, ఎవరైనా సస్పెన్షన్‌కు గురయ్యారా.. అనే విషయాలతో పాటు వారి ఆర్థిక వ్యవహార శైలికి సంబంధించిన డేటా కూడా సేకరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై జ్యుడీషియల్‌ విచారణ కోసం సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కు లేఖ కూడా రాశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించారు. అయితే విచారణలో ఆధారాలు తారుమారు చేస్తారనే ఉద్దేశంతో విజిలెన్స్‌ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరిగేషన్ శాఖ, విజిలెన్స్ దాడులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఈనెల 9న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి కూపిలాగుతున్నట్లు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో అప్పటి బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో లోపాలు ఏర్పడడం అటు బీఆర్ఎస్ పార్టీ అధినేతలకు, సంబంధిత శాఖాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోపాలపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టడంతో ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారు. ఎంతమందిపై చర్యలు తీసుకుంటారోననే చర్చలు ఈ ప్రాంతంలో ఊపందుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.