మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారనున్నారా.. అనుచరులతో మంతనాలు జరపడం వెనుక ఉద్దేశ్యమేంటి.. బీఆర్ఎస్ టిక్కెట్ రాదని కన్ఫామ్ చేసుకున్నారా..? అందుకే మరో పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా..? తుమ్మల వర్గీయులు, అనుచరులు నిర్వహిస్తున్న సమావేశాలు.. వాళ్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు.. తుమ్మలను పార్టీ మారమంటున్నాయా..? అంటే, అవునంటున్నాయి జరుగుతున్న పరిణామాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గండుగులపల్లిలోని నివాసంలో తుమ్మల నాగేశ్వరరావును పలువురు నాయకులు కలిశారు. ఈ భేటీలో పాలేరు నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పార్టీ మారాలని, ఎన్నికల్లో నిలబడాలని నేతలు తుమ్మలను కోరారు. చివరకు మళ్లీ ప్రయత్నించాలని.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారైనా పోటీ చేయాలంటూ సూచించారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు.
2018లో కాంగ్రెస్ లో గెలుపొంది.. బీఆర్ఎస్ లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో పార్టీ మార్పుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లో చేరాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం.. అయితే, తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అందుకే తుమ్మల అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.టికెట్ రాలేదన్న కారణంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఎంపీ నామా నాగేశ్వరరావుతో అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నించింది. అయినప్పటికీ.. తుమ్మల ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేసినట్లు సమాచారంవచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమంటున్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి విమర్శలు చేయడం లేదు.
తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తుమ్మల తీసుకునే రాజకీయ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వారంతా కోరుతున్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా తుమ్మలను కలిశారు. తుమ్మలకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీ అవకాశంగానీ ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇదంతా నిజం కాదని, ఈ ప్రచారం బీఆర్ఎస్ గేమ్ ప్లాన్లో భాగమని తుమ్మల వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తుమ్మల బీఆర్ఎస్లో కొనసాగే ఆలోచనతో లేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ఒక్క సీటే గెలిచిందని, ఇప్పుడు అంతకు మించిన నష్టం ఏమీ ఉండదని కేసీఆర్భావిస్తున్నట్టు చర్చ సాగుతోంది.
భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలను.. అభ్యర్థులను కేసీఆర్ సమవేశానికి పిలిచారు కానీ.. తుమ్మలను పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం లాంఛనమేనని ఆయన అనుచరులు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.