A place where you need to follow for what happening in world cup

ఓట్లు మావి సీటు మీదా?

  • ఖమ్మం లోక్ సభ సీటు కేటాయింపు వ్యవహారంలో బీసీల అసంతృప్తి
  • మంత్రుల తీరుపై గుస్సా
  • వలస అగ్రవర్ణ నేతలపై ఎందుకింత మమకారం?
  • ఏడు దశాబ్థాల అన్యాయంపై సర్వత్రా చర్చ

కాంగ్రెస్ ప్రముఖుల పుట్టినిల్లుగానూ, కమ్యూనిస్టు పోరాటాల గడ్డ గానూ పేరున్న ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువనే అంటారు. కానీ వెనుకబడిన వర్గాలకు ఇక్కడ జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదని చెప్పవచ్చు. ఖమ్మం లోక్ సభ సీటును ఏడు దశాబ్థాలుగా అగ్రవర్ణ నేతలకు, పారాషూట్ నాయకులకు కేటాయించడం ద్వారా వివిధ పార్టీల అసలు రంగు బయట పడింది. బీసీలకు అన్యాయం చేసిన పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా ఉండగా కమ్యూనిస్టులు, తెలుగుదేశం, వైయస్ఆర్ పార్టీలు దీని సరసన చేరాయి. లోక్ సభకు ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలు, నాలుగు సార్లు వెలమ, ఒక సారి కాపు, రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహించారు. 1952 లో పీడీఎఫ్ అభ్యర్థిగా టీబీ విఠల్ రావు ప్రాతినిధ్యం వహించగా 1957 లో కూడా సీపీఐ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. విఠల్ రావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. 1962, 1967,1971 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి. లక్ష్మీకాంతమ్మ వరుసగా విజయం సాధించారు.

ఈమె కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ పార్టీకి వలస అభ్యర్థులను దింపడం ఈమె నుంచే మొదలయింది. 1977, 1980 ఎన్నికల్లో జలగం కొండలరావు, 1984, 1989 ఎన్నికల్లో జలగం వెంగళరావు విజయం సాధించారు. వీరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. 1991 లో కాపు సామాజిక వర్గానికి చెందిన పారాషూట్ నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్య నాయుడికి కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించగా ఆయన విజయం సాధించారు. 1996 లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీపీయమ్ నేత తమ్మినేని వీరభద్రం విజయం సాధించగా 1998 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో పారాషూట్ నేత నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 లో కూడా పారాషూట్ నేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరికి టిక్కెట్ కేటాయించగా ఆమె విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో రేణుక పరాజయం పాలయ్యారు. 2009 లో టీడీపీ అభ్యర్థి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావు విజయం సాధించగా 2014 లో వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీపీఎం మద్దతుతో విజయం సాధించారు. 2019 లో నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

కుటుంబ సభ్యుల కోసం మంత్రుల ఆరాటం..


విజయావకాశాలు మెండుగా ఉన్న ఖమ్మం లోక్ సభ సీటును దక్కించుకోవడానికి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీపడుతున్నారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను తెరపైకి తెచ్చారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి, తుమ్మల తనయుడు యుగంధర్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం పావులు కదిపారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డి తనయుడు రఘురామరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. సురేందర్ రెడ్డి పొంగులేటి వియ్యంకుడు కావడం విశేషం. జిల్లాకు చెందిన వారికి టిక్కెట్ ఇవ్వకుండా మరో పారాషూట్ నేతను దింపడం పట్ల జిల్లా నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీసీ నేతలే లేరా?
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బీసీ నేతల్లో అర్హులు లేరా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. బీసీ సామాజిక వర్గాల్లో ఐక్యత లేక పోవడం వలనే తమ డిమాండ్ ను హై కమాండ్ వరకూ తీసుకువెళ్ళలేక పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఖమ్మం టిక్కెట్ తనకు కేటాయించాలని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వి. హన్మంతరావు ప్రయత్నించినప్పటికీ ఆయన అభ్యర్థత్వాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లాలో గిరిజన, దళిత ఓటర్లు అధిక సంఖ్యలో ఉండగా మిగిలిన వారిలో బీసీలు 60 శాతం వరకూ ఉంటారు. పూర్వపు ఖమ్మం పరిథిలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను ఎస్సీ సామాజిక వర్గానికి, అశ్వారావుపేట, పినపాక. ఇల్లెందు, వైరా, భద్రాచలం నియోజకవర్గాలను ఎస్టీలకు కేటాయించారు.

పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాలు మాత్రమే జనరల్ సీట్లుగా ఉన్నాయి. జనరల్ సీట్లలో ఒక్కటైనా బీసీలకు కేటాయించాలని కోరినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మల, కొత్తగూడెం నుంచి కూనంనేని (సీపీఐ) పోటీచేసి విజయం సాధించారు. వనమా వెంకటేశ్వరరావు, బండారు ప్రసాదరావు, బండారు అంజన్ రావు, లక్కినేని రఘు వంటి బీసీ నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినా ఎదిగినా పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలెవరూ కాంగ్రెస్ లో లేక పోవడం విశేషం. ఉన్న వారిలో ఎవరికైనా అవకాశాలు ఇస్తే వారు అగ్ర నేతలుగా ఎదిగే అవకాశం ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.