- మట్టి మనుషులపై పెత్తందార్ల దాష్ఠీకం..
- బోదాపురంలో పీడిత జన ఘోష
- పేదల భూమిపై పెద్దల కన్ను
- శాలివాహనులపై ‘గంప’ గుత్త దాడి
- గుమ్మాలకు ఇనుప కంచె వేసి బలవంతపు నిర్భంధం
- మధ్య యుగాల్ని మరిపించే అనాగరిక చర్యలు
- సివిల్ తగాదాలో తలదూర్చిన పోలీసు అధికారి
- బాధితులనే బెదిరిస్తున్న వైనం
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాము. అయినప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలు పోలేదు. బలమున్నవాడిదే రాజ్యమనే మధ్య యుగాల నాటి ఆటవిక నీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. పెత్తందార్లు, భూస్వాములు బడుగు బలహీన వర్గాలపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. చట్టం వారి చుట్టంగా మారిన వేళ పీడితులు తాడితుల ఆర్తనాదాలు ఎవరికీ వినిపించవు. వారిది ఇప్పటికీ అరణ్య రోదనే. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం గ్రామంలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

ఒకవైపు గల గలా పారే గోదావరి. మరోవైపు కర్రెగుట్టలు.. మధ్యలో ఉండే చిన్న ఆదివాసీ గ్రామం బోదాపురం. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు నివసించే ఈ గ్రామంలో శాలివాహన (కుమ్మరి )కుటుంబాలు తరతరాలుగా జీవనం సాగిస్తున్నాయి. 60 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన 40 సెంట్ల భూమిలో మూడు కుటుంబాలకు చెందిన గొడిశాల రమణయ్య, గొడిశాల శ్రీను, గొడిశాల సత్యం చిన్న ఇండ్లు నిర్మించుకుని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కుండలు, మట్టి పాత్రలు తయారు చేసి పొట్టపోసుకునే వారు. ఇటీవలి కాలంలో కుండలు కొనుగోలు చేసే వారు తగ్గిపోవడంతో సిమెంట్ వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయం కూడా సరిపోక కొన్ని బర్రెలను కొనుగోలు చేసి పాలు అమ్ముకుంటూ కాలం గడుపుతున్నారు. ప్రశాంత జీవనం సాగిస్తున్న కుమ్మరి జీవితాల్లో ఇటీవల అలజడి మొదలైంది. పొరుగున్న ఉన్న అగ్రకులం వారు భూ ఆక్రమణకు పాల్పడడమే కాక తరచూ భౌతిక దాడులకు దిగడంతో బడుగుల జీవితం ఛిద్రమై పోతోంది. కుమ్మరి వారు నివాసం ఉంటున్న మూడు ఇండ్లకు పక్కనే అగ్రకులం వారు భవనం నిర్మించుకున్నారు. తమ స్థలం వరకూ ప్రహరీ నిర్మించుకుని ఉత్తరం వైపు నడిచే వారు.
అయితే కుమ్మరి వారి ఇండ్ల ముందు బర్రెలు కట్టుకునే స్థలంపై అగ్రకులం వారి కన్నుపడింది. ఆ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలనే దురాశతో వారి స్థలంలో ట్రాక్టర్, ట్రాలీ పెట్టడం, పశువులను కట్టివేయడం చేస్తున్నారు. దీనిని ప్రశ్నించిన కుమ్మరి వారిపై దాడులకు దిగుతున్నారు. వీరికి ఒక గు‘లాబీ’ నాయకుడి అండదండలు లభించాయి. గొడిశాల సత్యం, గొడిశాల రమణయ్యలపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడడమే కాక మహిళలపై కూడా విచక్షణా రహితంగా అగ్రకులస్థులు దాడులు చేశారు. ఇంత జరుగుతున్నా బాధితులకు న్యాయం చేయాల్సిన ఒక పోలీసు అధికారి అగ్రకుల నిందితుల పక్షాన మాట్లాడుతూ భూమి వారిదేనంటూ ప్రచారం చేస్తున్నాడు.
ఎవరిదీ స్థలం?
60 సంవత్సరాల క్రితం 1964 మే 14 వ తేదీన యర్రం మల్లయ్య, ఆయన కుమారుడు యర్రం నాగయ్య తమ మెరక భూమిలో 75 సెంట్లు శాలివాహన కుటుంబానికి చెందిన గొడిశాల సత్యం కు అమ్మినారు. ఈ భూమిలో సత్యం వారసులైన మూడవ తరానికి చెందిన వారు రెండు గుంపులుగా జీవిస్తున్నారు. రెండవ గుంపునకు చెందిన గొడిశాల రమణయ్య, గొడిశాల శ్రీను, గొడిశాల సత్యం 40 సెంట్ల భూమికి అనుభవదారులగా ఉన్నారు. ఈ భూమిలో మూడు ఇండ్లు, పెరడు పోనూ తూర్పు వైపున ఉన్న అదనపు స్థలాన్ని తమ బతుకు తెరవు కోసం వాడుకుంటున్నారు. ఈ స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే దురుద్ధేశ్యంతో అగ్రకులం వారు ఇటీవల దాడులకు పాల్పడ్డారు.

ఐదు నెలల కాలంలో పలుమార్లు అగ్రకులాల వారు దాడులకు పాల్పడ్డారు. మొదటిగా జూన్ నెలలో దాడులకు దిగడమే కాక కుమ్మరి వారి ఇంటి గుమ్మాలకు ముళ్ళ ఇనుప కంచెలు వేసి మూడు రోజుల పాటు నిర్భంధించారు. మరో మారు 20 రోజుల వ్యవధిలో మళ్ళీ దౌర్జన్యానికి దిగి ఇంటి ముందు కంచె వేశారు. ఈ సందర్భంగా గొడిశాల రమణయ్య మెడకు తీవ్ర గాయమైంది. ఇండ్లకు కంచెలు వేసి నిర్భంధించడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటమే కాక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాశారు.

బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారు. అయినప్పటికీ పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్టోబర్ 24 వ తేదీన ఘర్షణకు దిగారు. ఈ దాడిలో కుమ్మరి సత్యం తీవ్రంగా గాయపడ్డారు. 108 లో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నుదుటిపై కుట్లు పడడంతో పాటూ కన్ను పైభాగంలోనూ చెవిలోనూ తీవ్ర రక్తస్రావమై ములుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదటి సారి దాడిలో గాయపడిన సత్యం భార్యకు చేతి కట్టు ఉండగా రెండవసారి మళ్ళీ దాడి చేశారు.
పొసెషన్ సర్టిఫీకెట్ ఇవ్వవద్దంటూ గ్రామ కార్యదర్శికి బెదిరింపులు
మూడు తరాలుగా నివసిస్తున్న కుమ్మరి కులస్తులు తమ ఇండ్లతో పాటూ ఇంటి ముందు తమ పశువులు కట్టివేసుకుంటున్న ప్రదేశానికి పొసెషన్ సర్టిఫీకెట్లు ఇవ్వాలని ఎంపీడీఓకి దరఖాస్తు పెట్టుకున్నారు. వారికి పొసెషన్ సర్టిఫీకెట్లు ఇవ్వవద్దని టీఆర్ఎస్ నేతలు గ్రామ కార్యదర్శిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్ళాలని శాలివాహన కుటుంబాల వారు నిర్ణయించారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని రాష్ట్ర బీసీ సంఘాల నేతలు ‘రేలా న్యూస్’ ప్రతినిధికి తెలిపారు. ఈ వరుస దాడులపై ఉన్నతాధికారులు స్పందించక పోతే ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తున్నది.






