పదేళ్లలో తెలంగాణకు కెసిఆర్ చేసింది శూన్యం
కనీసం సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్ కూడా ఇవ్వలేదు
సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం భదాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టును మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
తొలి పంప్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించగా..ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉండి అప్పటి ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు నిధుల కోసం ఒత్తిడి చేస్తే తాను మిగతా జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నానని, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని సిఎం తెలిపారు. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రాజెక్టుల పేర రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేసీఆర్, హరీష్‌లు బోగస్ మాటలు చెబుతారని, అందుకే ఆ పార్టీ నేతలు నీళ్ళ కోసం ఆందోళన చేయలేదన్నారు. నాగార్జున సాగర్ నీళ్ళు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టామని, లింక్ కెనాల్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటపడి చేయించామన్నారు.
మంత్రి తుమ్మలపై నమ్మకంతో నష్ట పరిహారం ఇవ్వక పోయినా లింక్ కెనాల్‌కు రైతులు భూములు ఇచ్చారని అన్నారు. సిఎం. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాలు పెంచారని, కమీషన్ల కోసం పంప్ మోటార్లు పెట్టారని, నాలుగేళ్లుగా పంప్ హౌస్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని, ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పంప్ హౌస్‌లో నీరు పారేలా చేశామన్నారు. కృష్ణా జలాలు రాక పోయినా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు అందే అవకాశం ఉందన్నారు.
పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో నీటి పంచాయితీ లేకుండా గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు. హరీష్ అభినందించక పోయినా ఫర్వాలేదు కానీ అవమానించేలా మాట్లాడొద్దని సిఎం రేవంత్ హితవు పలికారు. రానున్న రోజుల్లో 80, 60, 40, 20 శాతం పూర్తయిన ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.