చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. నాలుగు రోజుల నుంచి హై డ్రామా నడుస్తూనే ఉంది. అరెస్ట్, అనంతర పరిణామాలపై ఏపీ విపక్షాలు స్పందిస్తున్నాయి. జనసేన, లెఫ్ట్ పార్టీలు చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించాయి. కానీ… రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు దీని మీదే ఆసక్తికర చర్చ జరుగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే…. పార్టీ స్టాండ్ తీసుకున్నాకే స్పందించాలని, అప్పటి వరకు ఏం మాట్లాడవద్దని శ్రేణులకు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపారు అధ్యక్షురాలు పురంధేశ్వరి. తర్వాత కాసేపటికే… అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదంటూ రియాక్ట్ అయ్యారామె. కానీ… దానికి కొనసాగింపు మాత్రం లేదు. పురంధేశ్వరి వైపు నుంచి ఆ ఒక్క ప్రకటన తప్ప వేరే ఏ రియాక్షన్ లేదు. రిమాండ్‌కు పంపినా.. పురంధేశ్వరే కాదు..ఏపీ బీజేపీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చి పురంధేశ్వరి సైతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం వెనక ఏం జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది.
పార్టీ అధిష్టానమే ఆమెను తగ్గమందా? లేక మరే కారణం ఏదైనా ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ ప్రభుత్వం మీద.. వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారపవర్, లిక్కర్, శాండ్, ల్యాండ్ వంటి అంశాల్లో ఒకింత గట్టిగానే రియాక్ట్ అయ్యారు బీజేపీ నేతలు. ఇటీవల బీజేపీ చేస్తున్న విమర్శల్లో చాలా వరకు టీడీపీ తరహా విమర్శలే ఉండడంతో ప్రత్యర్థి వైసీపీకి కూడా బీజేపీ.. మరీ ముఖ్యంగా పురంధేశ్వరి టార్గెట్‌గా మారారు. మరిది చంద్రబాబు బాటలోనే వదిన పురంధేశ్వరి నడుచుకుంటున్నారంటూ విమర్శలు కూడా చేశారు వైసీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ-బీజేపీ మధ్య కూడా గ్యాప్ నెమ్మదిగా తగ్గుతోందని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టే చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పు పట్టారు పురంధేశ్వరి.
కానీ చంద్రబాబును రిమాండ్‌కు పంపిన దగ్గర్నుంచి కనీసం మాట్లాడలేదు. పురంధేశ్వరే కాదు.. ఏపీ బీజేపీ నేతలెవ్వరూ మాట్లాడలేదు. ఓ వైపు తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కొక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్రలో జరుగుతున్న పరిణామాలపై ఇక్కడి నేతలు మాట్లాడకపోవడం ఏంటన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు పొలిటికల్ పండిట్స్. ఇప్పటికే చంద్రబాబుకు వంతపాడుతూ.. ఆయనకు సహకరించేందుకు పురంధేశ్వరి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలి మీద టీడీపీ అనుకూలంగా ఉన్నారనే ఫిర్యాదులు అధినాయకత్వానికి వెళ్లినట్టు సమాచారం. కారణాలేమైనా.. రిమాండ్ విధించిన తర్వాత మాత్రం పురంధేశ్వరి సైలెంట్ అయిపోయారు.
ఈ క్రమంలో తనపై మరింతగా టీడీపీ ముద్ర పడకూడదనే భావనతో ముందు జాగ్రత్తగానే ఆమె కామ్‌గా ఉన్నారనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే సందర్భంలో మరో చర్చా ఉంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఏపీ బీజేపీ నేతలు కానీ.. పురంధేశ్వరి కానీ సైలెంటుగా ఉండడానికి కారణం ఢిల్లీ పెద్దలే అంటున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ విషయంలో పురంధేశ్వరి సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే… పార్టీ తెలంగాణ నేతలకు లేని ఆదేశాలు ఏపీ లీడర్స్‌కు మాత్రమే ఎలా ఉంటాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఎపిసోడ్‌లో బీజేపీ మౌనంపై రాజకీయవర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.