రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ రంగం స్వర్ణ యుగంగా నడుస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.శుక్రవారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డితో కలిసి రామన్నపేట మండల కేంద్రంలో 5 కోట్ల 50 లక్షలతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, చెన్నకేశవ ఆలయ పనులకు శంకుస్థాపన, సబ్ ట్రెజరీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య కారకులని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చారని, ఏ అక్క కూడా బిందెలతో రోడ్డు మీదికి రాకుండా ఎండాకాలంలో కూడా మంచినీళ్లు అందిస్తున్నారని తెలిపారు.
ఆనాడు ఉన్న 24 లక్షల పెన్షన్లను ఈనాడు 44 లక్షలకు పెంచి 2 వేల రూపాయల పెన్షన్ కల్పించారని, తద్వారా వృద్ధులకు ధైర్యం వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువులు దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచారని, ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండగా కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని అందించడం జరుగుతున్నదని, ఇప్పటివరకు 12 లక్షల 4 వేల పెళ్లిలకు ప్రతి పెళ్లికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించడం జరిగిందని, అంతే కాకుండా కెసిఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్ తో మహిళల ఆరోగ్యానికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని, రూపాయికి 80 పైసలు సర్కారీ దవాఖానాలలో ప్రసవాలు పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రులు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నాయని, ఈరోజు రామన్నపేట మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రికి మరో 10 కోట్లు మంజూరు చేస్తూ మొత్తం 15 కోట్లతో ఆధునిక పరికరాలు, ఏర్పాట్లతో ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని అన్నారు.
అలాగే నకిరేకల్ లో 35 కోట్లతో వంద పడకల ఆసుపత్రి కడుతున్నామని, నల్లగొండ, సూర్యాపేటలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, బిపి, షుగర్, ఎన్.సి.డి. కిట్లు, ఎ.ఎం.సి. చెకప్ లు నిరంతరం జరుగుతున్నాయని, గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే పరిస్థితి మారి సర్కారు దవాఖానాకు మాత్రమే పోదాంపా బిడ్డో అనే పరిస్థితి వచ్చిందని, అధునాతనమైన వసతులు, వైద్య ఏర్పాట్లతో ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు పెరిగాయని అన్నారు. గతంలో ఉత్త కరెంటు ఉండేదని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నిత్యం కోతలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాక ఆ పరిస్థితిని దాటి నేడు ముఖ్యమంత్రి దార్శనికతతో గత 10ఏళ్లుగా నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతున్నదని అన్నారు.
సంవత్సరానికి రెండుసార్లు ఎకరానికి 5 వేల పెట్టుబడి సహాయం అందిస్తూ, ఉచిత కరెంటు, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్లు, ఇంటింటికి మంచినీరు, నాణ్యమైన వైద్య సేవలు, రోడ్లు డ్రైనేజీలు బాగు చేసుకుంటున్నామని అన్నారు. కుల వృత్తులను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని, తన ప్రాణాలనే పణంగా పెట్టి కెసిఆర్ తెలంగాణ తెచ్చారని, లేకపోతే అభివృద్ధి జరిగేది కాదని, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఆకాశమంత ఎత్తు నిలిపారని అన్నారు. మైనార్టీ వర్గాలకు ఎన్నో అవకాశాలు కల్పించారని, ఇంగ్లీష్ మీడియంతో రెసిడెన్షియల్ స్కూళ్ళు, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు, రామన్నపేట చెరువు పూడికతీతకు 2 కోట్లు, అలాగే కాలువల నిర్మాణానికి మరో 2 కోట్లు మొత్తం నాలుగు కోట్లు ముఖ్యమంత్రి దృష్టికి తచ్చి మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలకు నిరంతరం మంచి చేయాలనే వ్యక్తి నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అని అన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ…. పనిచేసే శాసనసభ్యులు ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేదానికి సాక్ష్యం శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అని అన్నారు. 60 సంవత్సరాలు వెనుకబడిన ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ…. రామన్నపేట మండల కేంద్రంలో 5 కోట్ల 50 లక్షలతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, అలాగే చెన్నకేశవ ఆలయ నిర్మాణ పనులకు 2 కోట్ల 50 లక్షలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని, అలాగే మండల కేంద్రంలో రోడ్లు వెడల్పు పనులను 10 కోట్లతో చేపట్టడం జరిగిందని, అన్ని గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య మంత్రి నాయకత్వంలో వేగంగా జరుపుకుంటున్నామని అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నకిరేకల్ నియోజకవర్గంలో 25 హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కోట్ల నిధులు ఇచ్చి సంక్షేమ రంగాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రామన్నపేట చెరువు పూడికతీత పనులకు నిధులు అందించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు మరో 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమిటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి శాసనసభ్యులు పైళ్ళశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, ఎం.పి.పి.లు, జడ్.పి.టిసి.లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.