- అందరినీ విమర్శించడం సరికాదన్న కేశినేని నాని
- వాలంటీర్ వ్యవస్థ బాగుంటే కొనసాగిస్తానని చంద్రబాబు చెప్పారని వెల్లడి
- వాలంటీర్లు పార్టీలకు అతీతంగా పని చేయాలని వ్యాఖ్య
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు.
వ్యవస్థలో మంచి, చెడులు రెండూ ఉంటాయని, అందరినీ విమర్శించడం సరికాదని కేశినేని నాని చెప్పారు. ‘‘చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వాలంటీర్ వ్యవస్థ బాగుంటే కొనసాగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు” అని అన్నారు. అధికారులైనా, వాలంటీర్లు అయినా రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సూచించారు.