- నిఖిల్ హీరోగా రూపొందిన ‘స్పై’
- ఈ నెల 29న పాన్ ఇండియా రిలీజ్
- కంటెంట్ విషయంలో ఆడియన్స్ అసంతృప్తి
- ఒక క్లారిటీ అనేది లేకుండా సాగిన కథ
నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ రూపొందించిన ‘స్పై’ సినిమా, జూన్ 29వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో, ఐశ్వర్య మీనన్ – సాన్యా ఠాకూర్ కథానాయికలుగా పరిచయమయ్యారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తొలి రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాల విషయంలో ప్రేక్షకులు పెదవి విరిచారు.
ఈ సినిమాకి భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టారుగానీ .. కథపై పెద్దగా దృష్టి పెట్టలేదనే టాక్ విడుదల రోజునే వినిపించింది. టీజర్ .. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, ఇది సుభాశ్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి సంబంధించిన ఆపరేషన్ అనుకునే థియేటర్స్ కి వెళ్లారు. అయితే ఇంటర్వెల్ కి ముందు నడిచిన కథవేరు. ఆ తరువాత కథ అయినా సుభాశ్ చంద్రబోస్ చుట్టూ తిరిగిందా? అంటే అదీ లేదు.
ఇక ట్రైలర్ చివర్లో రానాను చూపించి మరింతగా ఆసక్తిని పెంచారు. ఆయన పాత్ర సినిమా చివరిలో వచ్చి ఆవేశంగా ఓ నాలుగు డైలాగులు చెబుతుంది. వాటికి కూడా ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. సినిమా చివరిలో సుభాశ్ చంద్రబోస్ కి సంబంధించిన ఫైల్ హీరోకి దొరుకుతుంది. అందులో ఏముంది? అని కొలీగ్ అడిగితే, ‘కొన్ని నిజాలు తెలుసుకోకపోవడమే మంచిది’ అంటూ హీరో సీక్వెల్ కి రెడీ అవుతుంటాడు. దాంతో ఆడియన్స్ ఉస్సూరుమనుకుంటూ లేస్తారు. ఒక స్పష్టమైన గోల్ లేకుండా ‘స్పై’ రంగంలోకి దిగడమే తమని నిరాశపరిచిందనేది ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాట.