- వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న తమ్మినేని
- వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని అనడం ఏమిటని మండిపాటు
- బుద్ధి లేని వ్యక్తులే ఇలా మాట్లాడతారని విమర్శ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లను ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని అనడం ఏమిటని ఆయన మండిపడ్డారు.
బుద్ధి ఉన్నవారు ఎవరైనా అలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇలాంటి మాటలు బుర్రలేని పనికిమాలిన వ్యక్తులు మాత్రమే మాట్లాడతారని విమర్శించారు. పిచ్చి మాటలు, వెకిలి చేష్టలు మానుకోవాలని పవన్ కు హితవు పలికారు. గట్టిగా అరవడం, తొడ కొట్టడం వంటివి సినిమాల్లోనే చెల్లుతాయని, రాజకీయాల్లో చెల్లవని అన్నారు.