A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ లో పాలేరు పంచాయితీ

ఒకరేమో ఓ పార్టీకి అధ్యక్షురాలు.. పాలేరు సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో పార్టీ విలీనంకోసం సిద్ధమవుతున్నారు.. మరొకరెమో పాలేరు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.. ఇంకొకరు పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ.. పాలేరు సీటే కావాలంటూ డిసైడ్ అయ్యారు. సీటు ఒక్కటే.. ముగ్గురు అభ్యర్థుల పోటీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఖమ్మం జిల్లా పాలేరు సీటు కీలకంగా మారింది. ఈ సీటు కోసం…షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాలేరు సీటు కోసం మొదటి నుంచి ఆశ పెట్టుకున్న షర్మిల, ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక కొన్ని తనకు, తన అనుచరులకు కొన్ని సీట్లు ఇవ్వాలని, ముందే క్లారిటీతో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరిపి..పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాలేరు నుంచే పోటీకి సై అంటున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్ ఆశించి, భంగపడిన మరో నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్‌లో చేరి, పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దాంతో హస్తం పార్టీలో పాలేరు టిక్కెట్‌ పంచాయతీ ఇప్పుడు బెంగళూరుకు చేరింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన డీకే శివకుమార్‌ దగ్గరికి పాలేరు పంచాయతీ చేరింది. అటు షర్మిల, ఇటు తుమ్మలతో వరుస భేటీలతో డీకే శివకుమార్ బిజీ అయ్యారు. ఇంతకీ.. పాలేరు టిక్కెట్‌ను ఎవరికిస్తారనే దానిపైనే సస్పెన్స్‌ కొనసాగుతోంది.ఓ వైపు షర్మిల డీకే శివకుమార్‌తో భేటీ అయి, పాలేరు విషయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పాలేరుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరడంతో, ఏకంగా ఈ పంచాయితీ డీకే దగ్గరికి చేరింది. ఆయనతో రేవంత్‌, తుమ్మల భేటీ తర్వాత దీనిపై అధిష్ఠానంతో మాట్లాడే అవకాశం ఉంది.

ఆ తర్వాతే తుమ్మలకు స్పష్టమైన హామీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.డీకేతో భేటీ తర్వాత, పాలేరుపై క్లారిటీ వస్తే తుమ్మల త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక తన అనుచరులతో కలిసి పాలేరులో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే జరిగితే, మరి షర్మిల ఏం చేయబోతున్నారు..? అధిష్ఠానం నుంచి ఆమెకు హామీ రాకపోతే సొంతగా బరిలో దిగుతారా..? లేక ఎంపీగా పోటీ చేస్తారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ తుమ్మలకు సీటు ఖరారైతే, పొంగులేటి ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.తెలంగాణ రాజకీయాలపై తుమ్మలకు అపారమైన అనుభవం ఉంది.

అనుచరులు కూడా కాంగ్రెస్‌లోకే వెళ్లాలని పట్టుబడుతున్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా అనుచరులతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో తుమ్మల వరుసగా భేటీ అవుతున్నారు. నిన్న రేవంత్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావుతో భేటీ అయ్యారు. పాలేరు నుంచే పోటీ చేస్తానని అధిష్ఠానం ముందు తుమ్మల ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారంరేవంత్, డీకేతో భేటీ తర్వాత తుమ్మల బెంగళూరు నుంచి నేరుగా ఖమ్మం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనుచరులతో మంతనాలు జరిపి.. రేపు తుది నిర్ణయం చెప్పబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల రాక కోసం అనుచరులు ఎదురుచూస్తున్నారు. అయితే, తుమ్మలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలెంటీ..? తుమ్మల డిమాండ్స్ ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.