- బేగంపేటలోని కేటీఆర్ కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న వైనం
- నందికంటి శ్రీధర్, ఆయన వెంటొచ్చిన నాయకులకు సముచిత గౌరవస్థానం కల్పిస్తామన్న కేటీఆర్
- కాంగ్రెస్‌లో శ్రీధర్‌కు అన్యాయం జరిగిందని వ్యాఖ్య
- మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానన్న శ్రీధర్
కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ బుధవారం బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శ్రీధర్‌కు కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీధర్‌కు కాంగ్రెస్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. జీవితాంతం పార్టీ కోసమే పనిచేసిన ఆయనను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ పార్టీలో ఆయనకు సముచిత స్థానమిచ్చి గౌరవించుకుంటామని ఆన్నారు. తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీధర్ కోరారని, ఆయన కోరిక మేరకు ఆయా నేతలను గౌరవించుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కేటీఆర్ శ్రీధర్‌ను కోరారు.
కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తం, చెమట ధారపోసినా సరైన స్థానం దక్కలేదని నందికంటి శ్రీధర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వంలో ఇకపై పనిచేస్తానని చెప్పారు. మాల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావును ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధర్ వెంట వచ్చిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.