మర్కజ్ ఇంతేజామీ కమిటీ మిల్లతే-ఎ-ఇస్లామియ అధ్యక్షుడు ఖుతుబోద్దిన్
మెట్ పల్లి:ముస్లీంలను ఫకీరులంటూ సంబోధించి అవమానించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెంటనే యావత్ ముస్లిం లందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మెట్ పల్లి మర్కజ్ ఇంతేజామీ కమిటీ మిల్లతే-ఎ-ఇస్లామియ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు ముస్లీంలను మభ్యపెట్టేందుకు కొత్త పథకాలు తెస్తున్నారని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి తొమ్మిదేళ్ళు గడిచినా ముస్లీంల రిజర్వేషన్ల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అంటిముట్టనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైనార్టీలకు కుట్టుమిషన్ల ఆశ చూపి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలో షాదీఖాన పనులు నత్తనడుకగా సాగుతున్నాయని ఆరోపించారు.
అదే విధంగా పలు కార్యక్రమాల్లో మైనారిటీ నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా వారి రాజకీయ ఎదుగుదలను అనిచి వేస్తున్నారని విమర్శించారు…ముస్లీం ప్రజాప్రతినిదులపై చూపుతున్న వివక్ష పై నిలదీస్తామని హెచ్చరించారు. ముస్లీంలను ఓటు బ్యాంకు కోసమే తప్ప వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లీంల పట్ల సవతి ప్రేమ చూపుతున్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మర్కజ్ ఇంతేజామీ కమిటీ మిల్లతే-ఎ-ఇస్లామియ ఉపాధ్యక్షులు షేక్ సాదక్ హుస్సేన్, మహమ్మద్ సమియుద్దిన్, మైనారిటీ నాయకులు రహీముద్దీన్, మహమ్మద్ ఫెర్రోజ్ తదితరులు పాల్గొన్నారు..