తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించేందుకు గవర్నర్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీ అయిపోయి చాలా కాలం అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను నామినేటెడ్ కోటాలో భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం జూలై 31న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నా ఇంకా దానికి గవర్నర్ ఆమోదముద్ర లభించలేదు. ప్రభుత్వం పంపిన ఫైళ్లను రాజ్‌భవన్ పరిశీలిస్తూ ఉన్నది. నెల రోజులు దాటినా వారిద్దరి నియామకాలపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. వారికి అర్హతలు లేవన్నట్లుగా మాట్లాడటంతో… ఇక ఫైల్ పెండింగ్ లోనే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్ోతంది. ప్రభుత్వం నుంచి ఫైళ్లు వచ్చిన వెంటనే ఆమోదం తెలపలేనని, వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించిన తర్వాతనే తగిన నిర్ణయం తీసుకోవడం వీలవుతుందని, అందువల్లనే సమయం పడుతున్నదని గవర్నర్ ప్రకటించారు.
వారిద్దరూ ప్రభుత్వం పేర్కొన్న కేటగిరీలో ఫిట్ అవుతారో లేదో? ఒక నిర్ణయానికి రావడానికి పరిశీలన చేయాల్సి ఉన్నదని, ఆ కారణంగానే ఇంకా ఆమోదం తెలపకుండా అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు స్వయంగా గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నియమితులైన తర్వాత నాలుగేండ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫైల్‌కు సంబంధించిన వివరాలను తమిళిసై సౌందర్ రాజన్ వెల్లడించారు. దీంతో సానుకూల ఫలితం వచ్చేంతవరకూ వెయిట్ చేయడం మినహా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణకు మరో అవకాశం లేకుండాపోయింది.గతంలో సోషల్ సర్వీస్ విషయంలో కౌశిక్‌రెడ్డి ఫైల్‌కు సైతం గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఆ ప్రయత్నం నుంచి ప్రభుత్వం వెనుకడుగు వేయక తప్పలేదు.
రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశాలను కల్పించుకునే స్వేచ్ఛ పార్టీలకు ఉంటుందిగానీ గవర్నర్ నామినేటెడ్ విషయంలో అర్హతలు, ప్రామాణికాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె నొక్కిచెప్పడంతో పరోక్షంగా వారికి తగిన అర్హతలు లేవన్న అంశాన్ని బహిర్గతం చేసినట్లయింది.నెల రోజులుగా ఈ ఫైల్ ఆమోదానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నప్పటికీ గత నెల 25న సచివాలయ ప్రాంగణంలో ఆలయాల ప్రారంభోత్సవానికి స్వయంగా సీఎం ఆహ్వానం పలికి స్వాగతించడంతో ఆమోదం లభిస్తుందని అనుకున్నారు.
కానీ అది జరిగిపోయి కూడా పది రోజులు దాటింది. అయినా ఈ ఫైల్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గవర్నర్ కేసీఆర్ ను పొగుడుతున్నారు. సూపర్ సీఎం అంటున్నారు కానీ.. బిల్లులు, ఎమ్మెల్సీల ఫైల్స్ పై సంతకం పెట్టేందుకు సిద్ధంగా లేరు. రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగితే అనేక భిన్నాభిప్రాయాలకు తావు ఉండదని తమిళిసై అంటున్నారు. గతంలో గవర్నర్ నరసింహన్‌తో నామినేటెడ్ ఎమ్మెల్సీ విషయంలో పెద్దగా చిక్కులు ఎదురుకానప్పటికీ తమిళిసై వచ్చిన తర్వాత తొలుత కౌశిక్‌రెడ్డి, ఇప్పుడు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణకు ఇబ్బందులొచ్చాయి.