- పోత్తులతో సర్దుకుంటారా
- ఈనెల 12న ఢిల్లీకి షర్మిల ?
హైదరాబాద్ : మాజీ సీఎం వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ తో కలవబోతున్నారా? షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా? అంటే తెలంగాణ రాజకీయ వర్గాలలో అవునని గట్టిగానే వినిపిస్తుంది. షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది అప్పట్లో ప్రచారంగానే ఉండిపోయింది. జులైలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడ వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు.
కాగా, ఈసారి షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం ఖారైరైందంటూ మరో సారి రాజకీయవర్గాలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ముందుగా షర్మిల సోనియా గాంధీతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఈనెల 12వ తేదీన షర్మిల ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం గురించి ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కొంతకాలంగా షర్మిల పార్టీ విలీనం అవుతుందా? లేక పొత్తులతో ముందుకు వెళ్తారా అనే చర్చ అయితే విస్తృతంగా సాగుతుంది. మొదట్లో షర్మిల పొత్తుకు మొగ్గు చూపితే కాంగ్రెస్ నేతలు విలీనానికే పట్టుబట్టారు. అయితే రెండు పద్దతుల్లో లాభనష్టాలను బేరీజు వేసుకున్న తరువాత షర్మిల కూడా విలీనానికే సిద్ధపడ్డారని కాంగ్రెస్, వైఎస్సార్టీపీ వర్గాలు చెబుతున్నాయి.
షర్మిల తరపున కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కర్ణాటక నుండి డీకే శివకుమార్ మాట్లాడుతుండగా.. ఈ భేటీతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం చేసేయాలని.. అందుకు ప్రతిఫలంగా ఆమెని రాజ్యసభకి పంపించడం.. కావాలంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కూడా షర్మిలకే అప్పగించడం వంటి ప్రతిపాదనలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకి వస్తామని.. అది కూడా కేవలం తెలంగాణలోనే తన ప్రమేయం ఉంటుందని షర్మిల చెబుతున్నారని అంటున్నారు. మరి ఈ రెంటిలో ఏది ఫైనల్ అవుతుంది? కాంగ్రెస్ షర్మిలను విలీనానికి ఒప్పించగలుగుతుందా? ఒకవేళ షర్మిల ఒకే అంటే ఆమె ఏపీకి వెళ్తారా.. తెలంగాణలోనే ఉంటారా అన్నది ఈ భేటీతో తేలే అవకాశం కనిపిస్తుంది. నిజానికి షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేసి పార్టీ పగ్గాలను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే ఆమెకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని నమ్ముతోంది. అయితే అందుకు షర్మిల అంగీకరించలేదనీ, తాను తెలంగాణకే పరిమితమౌతానని భీష్మించారనీ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తన రాజకీయం ఇక తెలంగాణలో అంటూ షర్మిలనే స్వయంగా చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో షర్మిల భేటీ కానున్నట్లు వస్తున్న వార్తలతో వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ ల మద్య విలీనంపై ఒక అవగాహన కుదిరిందనే భావించాల్సి ఉంటుంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక వర్గం షర్మిల రాకను ఆహ్వానిస్తుంటే మరొక వర్గం ఆమెని ఏపీకి వెళ్లి రాజకీయం చేసుకోమని బహిరంగంగానే చెప్తున్నారు.
ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో తాను ఉన్నంత వరకూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలలో షర్మిల వేలు కూడా పెట్టలేరని అన్నారు. ఆమె ఏపీలో రాజకీయం చేస్తే తెలంగాణ పీసీసీ అధినేతగా తాను ఆమెతో చర్చలు జరుపుతానని అన్నారు.మరి ఇప్పుడు సోనియా గాంధీతో షర్మిల భేటీ అనంతరం షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం, ఆమె పార్టీలో చేపట్టబోయే బాధ్యతలపై స్పష్టత వస్తుందని అంటున్నారు. అన్నిటికీ మించి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశంగా చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి జగన్ రాజకీయమే కారణమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం గట్టిగా నమ్ముతోంది. షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తే జగన్ కు అది కచ్చితంగా ప్రతికూలంగా మారి వైసీపీకి పూడ్చుకోలేని నష్టం చేకూరుస్తుందని కూడా భావిస్తోంది…