- భీమా యోజన పథకాన్ని తక్షణమే అమలుపరచాలి
- తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి
జగిత్యాల:అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు పరచాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . జగిత్యాలలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం నాడు విలేకరులతో శేర్ నర్సారెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలు ,అతివృష్టి , అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు .
ఆపద కాలంలో రైతులకు అండగా ఉండే ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి ఉన్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతులకు న్యాయం జరిగి ఉండేదన్నారు . అకాల వర్షాలతో గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏలాంటి సాయం అందించలేదని ఆరోపించారు . రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోని రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ సమావేశంలో చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి , తెలంగాణ రైతు ఐక్యవేదిక నాయకులు కాటిపల్లి నాగేశ్వర్ రెడ్డి,యాల్ల అంజిరెడ్డి ,రాజరెడ్డి ,శేఖర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు .