- ఇస్లామిక్ ప్రపంచానికి మోదీ చేరువ కావడం ఆదర్శప్రాయమన్న థరూర్
- విదేశాంగ విధానంపై ప్రారంభంలో విమర్శలు చేశా.. కానీ బాగుందని కితాబు
- తన వ్యాఖ్యలను ఆనందంగా వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడించిన ఎంపీ
ఇస్లామిక్ ప్రపంచానికి, ముఖ్యంగా అరబ్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరువకావడం ఆదర్శప్రాయమైన అంశమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. మోదీ ప్రభుత్వ విజయాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ – న్యూస్18 నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, కేంద్ర విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపించారు. విదేశాంగ విధానానికి సంబంధించి ప్రారంభంలో తాను మోడీ పాలనపై విమర్శలు చేశానని, కానీ క్రమంగా వారి తీరు బాగుందన్నారు.
తనకు బాగా గుర్తుందని, మోదీ ప్రధాని అయిన మొదటి ఏడాదిలో 27 దేశాల్లో పర్యటించారని, వాటిలో ఒక్కటి కూడా ఇస్లామిక్ దేశం లేదన్నారు. దీనిని తాను పాయింట్ ఔట్ చేశానని, కానీ ఆ తర్వాత ఇస్లామిక్ ప్రపంచానికి చేరువ కావడానికి మోదీ చేసిన కృషి అద్భుతమన్నారు. ప్రధాన ముస్లీం దేశాలతో మన సంబంధాలు ఎప్పుడూ బాగా లేవని, కానీ ఇప్పుడు మోదీ కారణంగా అన్ని ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని, ఈ సమయంలో తన వ్యాఖ్యలను ఆనందంగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.
శశిథరూర్, తప్పనిసరి పరిస్థితుల్లో బలహీనమైన క్షణంలో నిజం మాట్లాడారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా అన్నారు. జీ20 అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుందని, భారత్ ను హైలెట్ చేసిందన్నారు. ప్రపంచం ఇకపై భారత్ ను విస్మరించలేని పరిస్థితి అని, ప్రధాని మోదీ విదేశాంగ విధానం ఆ స్థానానికి తీసుకు వెళ్లిందన్నారు.
అయితే మోదీ చైనా విధానంపై మాత్రం థరూర్ విమర్శలు చేశారు. భారత్ పై అతిక్రమణలకు చైనాకు ఉచిత పాస్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. చైనీస్ యాప్స్ పై నిషేధం కేవలం టోకెనిజం మాత్రమే అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకు రావాలన్నారు.